కీలకమైన జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి జగన్ మరోమారు సమీక్ష నిర్వహించనున్నారు. గోదావరి జలాల సమర్థ వినియోగంపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని నిర్ణయించిన ఆయన... దీనికి సంబంధించి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వృథాగా సముద్రంలో కలిసిపోతున్న గోదావరి నీటిని సరిగ్గా వినియోగించుకునేందుకు కూడా అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలని... ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇవాళ నిర్వహించే సమీక్షలో అధికారులు సంబంధిత నివేదికలు అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐఏఎస్ల బదిలీల అనంతరం సమీక్షను నిర్వహిస్తున్నందున... జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఆదిత్యనాథ్ దాస్ సమీక్షకు హాజరు కానున్నారు. పోలవరం ప్రాజెక్టు అత్యంత ప్రధానమని గత సమీక్షలోనే స్పష్టంచేసిన సీఎం... ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాల్సిన ప్రాజెక్టులపై జలవనరుల శాఖ అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. వెలుగొండ, హంద్రీనీవా, వంశధార సహా రాష్ట్రంలోని ముఖ్యమైన ప్రాజెక్టులపై సమీక్షించనున్నారు.
వ్యవసాయం, అనుబంధ రంగాలపైనా సీఎం సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. 2019 ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి ప్రభుత్వ కార్యాచరణతోపాటు... రైతులకు పెట్టుబడి సాయంపైనా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండీ: ప్రజావేదిక కోసం జగన్కు చంద్రబాబు లేఖ