తెదేపా ప్రభుత్వ హయాంలో రైతు ఆత్మహత్యలు ఎక్కువగా జరిగాయని.. కానీ వాటిని తక్కువ చేసి చూపించారని ముఖ్యమంత్రి జగన్ ఆరోపించారు. స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో ఇవాళ తొలిసారి సమీక్షించిన సీఎం.. కష్టాల్లో ఉన్న రైతు కుటుంబాలను కలిసి సాంత్వన కల్పించాలని సూచించారు. 2014 నుంచి 2019 వరకూ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారంపై అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల నేర నమోదు బ్యూరో రికార్డుల ప్రకారం 1513 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని... అయితే కేవలం 391 మంది రైతు కుటుంబాలకు మాత్రమే పరిహారం ఇవ్వటాన్ని సీఎం తప్పు పట్టారు.
బలవన్మరణానికి పాల్పడిన రైతుల కుటుంబాలకు ఇచ్చే పరిహారం 5 నుంచి 7 లక్షలకు పెంచామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ పరిహారం అందించే విషయంపై ప్రత్యేకమైన చట్టాన్ని కూడా తీసుకువస్తున్నట్టు సీఎం జగన్ ప్రకటించారు. జిల్లాల వారీగా ఆత్మహత్యలు చేసుకున్న రైతుల వివరాలతో జాబితాను రూపొందించి.. వెంటనే వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి బాధిత కుటుంబాలను పరామర్శించాలని కలెక్టర్లు, ఎస్పీలకు సూచించారు. . రైతులకు సంబంధించిన అంశాలపై పదేపదే సీఎం కార్యాలయం చెప్పే పరిస్థితి ఉండకూడదని చెప్పారు. తమ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని.. మానవత్వం ఉన్న ప్రభుత్వం అని చెప్పుకునే దిశగా జిల్లా అధికారులు పాలన సాగించాలని సూచించారు.