తెదేపా నేతలతో ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ చేశారు. మేనిఫెస్టోకు వస్తున్న స్పందనపై మాట్లాడారు. మహిళల సంక్షేమానికి రూ.2 లక్షల కోట్లు ఖర్చు పెడతామన్నారు. బిడ్డను బడికి పంపే ప్రతి అమ్మకు ఏడాదికి 18 వేలు అందిస్తామన్న హామీని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా చెప్పారు. నెలకు 1500 రూపాయలతో బిడ్డ చదువు బాధ్యతను తల్లికే అప్పగిస్తామన్నారు. వచ్చే ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు పసుపు - కుంకుమకు ఖర్చు చేస్తామన్నారు. తెదేపా మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
మేనిఫెస్టోలో అభివృద్ధి, సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చాం. ఎయిర్‌పోర్టులు, ఓడరేవుల అభివృద్ధి స్పష్టంగా చెప్పాం. తటస్థులు, మేధావులను తెదేపా వైపు ఆకర్షించాలి. ఐదేళ్లలో పడిన ఇబ్బందులు, తెదేపా కృషిని చెప్పాలి. తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్రం భవిష్యత్తుగా వివరించాలి. పొరబాటు చేస్తే రాష్ట్ర భవిష్యత్తుకే పెనుప్రమాదం. సంపద సృష్టి గురించి వైకాపా మేనిఫెస్టోలో లేదు. రాజధాని, నదుల అనుసంధానం అంశాలు జగన్ చెప్పలేదు. అమరావతి అభివృద్ధిపై వైకాపా మేనిఫెస్టోలో చెప్పలేదు. జిల్లాలు, మండలాల పారిశ్రామికీకరణపై జగన్‌కు అవగాహన లేదు. విదేశాలకు ఎవరైనా వెళ్లాలంటే అన్ని అంశాలు పరిశీలిస్తారు. 31 కేసులున్న జగన్ విదేశాలకు ఎలా వెళ్తారు? ఇన్ని నేరాలున్న వ్యక్తిని నమ్మి ఎవరైనా పెట్టుబడులు పెడతారా? తెదేపాకు వేసే ఓటు చంద్రబాబుకు ఓటుగా చెప్పాలి. వైకాపాకు వేసే ఓటు జగన్ నేరాలకు ఓటుగా చెప్పాలి. తొలిఓటు నేరాలు - ఘోరాల పార్టీకి వేస్తే జీవితాంతం క్షోభ. ఉద్యోగానికి వెళ్తే గుణగణాలను బేరీజు వేస్తారు. ఉన్నత చదువులకు వెళ్లాలంటే కేరెక్టర్ సర్టిఫికెట్ అడుగుతారు. మరి రాజకీయాల్లో ఉండే కేరెక్టర్ సర్టిఫికెట్ జగన్ కు ఉందా..? జైళ్లకు వెళ్లినవాళ్లకు ప్రజా జీవితంలో ఉండే కేరెక్టర్ సర్టిఫికెట్ ఉంటుందా..? రాజకీయాల్లో ఉండే కేరెక్టర్ సర్టిఫికెట్ ‘‘నేరాలు-ఘోరాల’’ పార్టీకి ఉందా..? రూ.63వేల కోట్ల రాఫెల్ స్కామ్ పార్టీకి ఎవరైనా ఓటేస్తారా..? 97మంది నేరగాళ్లను నిలబెట్టిన వైకాపాకు ఎవరైనా ఓటేస్తారా..? - టెలీ కాన్ఫరెన్స్లో తెదేపా నేతలతో అధినేత చంద్రబాబు
తెదేపా నేతలపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని చంద్రబాబు చెప్పారు. ఈ ఎన్నికలను రాష్ట్రానికే జీవన్మరణ సమస్యగా అభివర్ణించారు. కులాలను, మతాలను రెచ్చగొడుతున్నారన్నారు. మోసం చేయాలని, దొంగదెబ్బ తీయాలని చూస్తున్నారని ప్రత్యర్థి పార్టీల నేతలపై ఆరోపణలు గుప్పించారు. తెదేపా గెలుపే అందరి దృఢ సంకల్పం కావాలని పిలుపునిచ్చారు. భావితరాల భవిష్యత్తే మనందరి లక్ష్యం కావాలన్నారు. ఆంధ్రా ద్రోహులు అందరికీ బుద్ది చెప్పాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ను తిరుగులేని శక్తిగా రూపొందించాలని.. దేశభక్తితోపాటు రాష్ట్ర భక్తి అందరిలో రావాలని కోరారు. పౌరుషంగా పనిచేయాలని, త్యాగాలకు సిద్ధం కావాలన్న చంద్రబాబు... తెదేపా కార్యకర్తలు, నాయకులు గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డాలని సూచించారు.