కొద్దినెలల్లో సార్వత్రిక ఎన్నికలు. ఎదురుగా ఎన్నో సవాళ్లు. ఏకమవుతున్న విపక్షాలు. అధికారం ఎవరిదన్నదానిపై లేని స్పష్టమైన అంచనాలు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాకర్షక మంత్రానికే జైకొట్టింది ఎన్డీఏ ప్రభుత్వం. మధ్యంతరం అంటూనే వరాల బడ్జెట్ తెచ్చింది. రైతులు, పేద, మధ్యతరగతి, పట్టణ ప్రజలు, ఉద్యోగుల ఓట్లకు గురిపెట్టింది. ఆదాయ పన్ను పరిమితి పెంపు, రైతులకు ప్రత్యక్ష నగదు సాయం వంటి బ్రహ్మాస్త్రాలు ప్రయోగించింది.
దేశవ్యాప్తంగా 'రైతు బంధు'
దేశవ్యాప్తంగా రైతులు చేస్తున్న నిరసనలు, ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎదురైన పరాజయాన్ని దృష్ట్యా మోదీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కర్షకుల కోసం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరిట ఆర్థిక సాయం ప్రకటించింది. 5 ఎకరాలలోపు ఉన్న ప్రతి రైతుకు ఏటా రూ. 6 వేలు ఆర్థికసాయం ప్రకటించింది. ఈ పథకం ద్వారా 12కోట్ల మంది రైతులకు లబ్ధిచేకూరుతుందని అంచనా.
పన్నుల ఊరట
2014లో అధికారంలో వచ్చాక ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో ఆదాయ పన్ను పరిమితిని పెంచింది మోదీ ప్రభుత్వం. ఆ తర్వాత దాని జోలికి వెళ్లలేదు. ఇప్పుడు పన్ను రిబేట్ పరిమితిని 5లక్షల రూపాయలకు పొడిగించింది. పొదుపు, పెట్టుబడులు కలిపి రూ. 6.50 లక్షల వరకు పన్ను రిబేట్‌ను పెంచింది. స్డాండర్డ్ డిడక్షన్, టీడీఎస్ వంటి ఇతర విషయాల్లోనూ వేతన జీవులకు ఊరట కలిగించేలా ప్రకటనలు చేసింది కేంద్రం.
పింఛన్ల ప్రకటన
నోట్ల రద్దు, వస్తు-సేవల పన్నుల ప్రత్యక్ష ప్రభావం ఎదుర్కొన్న అసంఘటిత రంగ కార్మికుల కోసం కొత్త పింఛన్ పథకం తెచ్చింది కేంద్రం. ప్రధాన మంత్రి శ్రమయోగి మాన్‌ధన్ పేరిట కార్మిక పింఛను పథకం ప్రకటించింది. 60 ఏళ్లు నిండిన కార్మికులందరికీ నెలకు రూ. 3 వేల పింఛన్ అందిస్తామని చెప్పింది.
కీలక రంగాలకు నిధులు పెంపు
గ్రామీణ ప్రాంతాలతో సంబంధం ఉన్న రంగాలకు బడ్జెట్లో సమృద్ధిగా నిధులు కేటాయించింది కేంద్రం. ఉపాధి హామీ పథకం నిధులను 60వేల కోట్లకు పెంచింది.
రక్షణ రంగానికి నిధుల్ని 7శాతం పెంచింది. ఫలితంగా రక్షణ రంగం బడ్జెట్ 3లక్షల కోట్లు దాటింది. రైల్వే ఛార్జీల జోలికి వెళ్లలేదు కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్. రైల్వేకు సంబంధించి ఎలాంటి భారీ ప్రాజెక్టులు ప్రకటించలేదు. ఆధునీకరణపై దృష్టిపెడతామని చెప్పారు.
ప్రగతి నివేదిక
వరాల జల్లుతోపాటు ఐదేళ్లలో తమ ప్రభుత్వం సాధించిన విజయాల్ని వివరించేందుకు బడ్జెట్‌ను ఓ సందర్భంగా ఉపయోగించుకున్నారు గోయల్. ఒక్కో రంగంలో ఎలాంటి మార్పులు వచ్చాయో గణాంకాలతో సహా వివరించారు.
నవలోకం మా స్వప్నం
పదేళ్ల తర్వాత భారత్‌ను ఎలా చూడాలనుకుంటున్నారో బడ్జెట్ ద్వారా వివరించారు గోయల్. ఆ ఆకాంక్షలు నెరవేర్చుకునేందుకు ఎలాంటి ప్రణాళికలు అనుసరించనున్నారో వెల్లడించారు.