విజయవాడ మహానగరంలో కొన్నిచోట్ల మహిళలు బయటకు రావాలంటే జంకుతున్నారు. ఒంటరిగా వెళ్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని పెట్రేగిపోతున్న గొలుసు దొంగలను చూసి బెంబేలెత్తుతున్నారు. నెలరోజుల్లో రెండు గొలుసు దొంగతనాలు జరిగడంపై... పోలీసులు ప్రత్యేక దృష్టిపెట్టారు. సీసీఎస్ ఠాణాలు ఏర్పాటు చేసి... దొంగలను పట్టుకోవడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు.
ప్రత్యేక బృందం ఏర్పాటు...
గొలుసు దొంగతనాలు జరుగుతున్న తీరును పరిశీలించి... నేరాలు ఎక్కువ జరిగే ప్రాంతాలను గుర్తించారు. ముగ్గురు ఎస్సైలు, 12 మంది కానిస్టేబుళ్లుతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక బృందాలు సీఐల ఆధ్వర్యంలో పనిచేస్తాయి. కేవలం నేరాలు జరిగినప్పుడు మాత్రమే కాకుండా... ప్రతిరోజు సమాచారం సేకరిస్తుంటారు. పెనమలూరు, నున్న, పటమట, మాచవరం పోలీసుస్టేషన్ల పరిధిలో అధికంగా జరుగుతున్నాయ గుర్తించిన పోలీసులు... ఈ ప్రాంతాల్లో నిఘా పెంచారు.
స్థానిక ముఠాల పనే...
స్థానిక ముఠాలే ప్రస్తుతం గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నాయని పోలీసులు నిర్ధరణకు వచ్చారు. పండుగ రోజుల్లో... ఉదయం, సాయంత్రం వేళల్లో గొలుసు దొంగతనాల నిరోధక బృందాలు నిఘా పెంచుతాయని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా నిందితుల ఫొటోలు సేకరించిన పోలీసులు... కొన్ని కేసుల్లో నిందితులను అరెస్టు చేశారు.