అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. లాబీలో చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తారసపడగా.. ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఇరువురి మధ్య సరదా సంభాషణ చోటు చేసుకుంది. సభా సంప్రదాయాలు కచ్చితంగా పాటిస్తున్నామని శ్రీకాంత్ రెడ్డి అనగా... తామూ చూస్తున్నామని పయ్యావుల సమాధానమిచ్చారు. బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక మంత్రి బుగ్గన సమాధానం కంటే ముందు పయ్యావుల, ప్రతిపక్ష నేత లాంటి వాళ్లు మాట్లాడతారని ఆశించామని.. కేటాయించిన సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
మేం పార్టీలు మారే రకం కాదు..
అమెరికాలో తానా సభల విశేషాలను శ్రీకాంత్ రెడ్డి పయ్యావులను అడిగారు. రాం మాధవ్ - పయ్యావుల భేటీ అంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా తమవి రాజకీయ కుటుంబాలని.. తామిద్దరం పార్టీలు మారే రకం కాదని శ్రీకాంత్ రెడ్డి సమాధానమిచ్చారు.
వైకాపా గుర్తుపై గెలవలేరని డిసైడ్ అయిపోయారా?..
"వారు లోపల (అసెంబ్లీలో) కొట్టుకుంటారు కానీ బయట సరదాగా ఉంటారు" అని గుంటూరు ఎమ్మెల్యే ముస్తాఫా అనగా... అక్కడ అంశాల పరంగా వాగ్వాదం చేసుకుంటామని పయ్యావుల అన్నారు. రెండింటికీ సంబంధం లేదని చెప్పారు. రాజీనామా చేస్తే కానీ వైకాపాలోకి తీసుకోమన్న నిబంధన లేకుంటే చాలా మంది వైకాపాలోకి వచ్చేవారని ముస్తఫా సరదాగా అన్నారు. రాజీనామా చేసి వస్తే వైకాపా గుర్తుపై ఇక గెలవలేరని డిసైడ్ అయిపోయారా అంటూ పయ్యావుల చమత్కరించారు.