ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకూ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే ఓట్ల యుద్ధం. ఊహించిన దానికన్నా ముందస్తుగా వచ్చేసిన ఎన్నికలు.. రాజకీయ పక్షాలకు గట్టిగా ఓ 20రోజులసమయం కూడా ఇవ్వలేదు. ఈ లోగానే ఓటరు మహాశయులను తమ వశం చేసుకోవడం.. వైరిపక్షాలను దెబ్బతీయడం.. స్వపక్షంలో అలకలను బుజ్జగించడం.. ఇలా రాజకీయ పార్టీలకు.. ఇప్పుడు బోలెడంత పని..!
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కూడా రాజకీయ కాక మరింత పెంచింది. 25 లోక్సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ నెల 25తో నామినేషన్ల గడువు ముగియనుంది. 26న నామినేషన్ల పరిశీలన, 27 నుంచి 28 వరకు ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నారు. ఏప్రిల్11న పోలింగ్ జరగనుండగా.. మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అసలే పోటాపోటీగా ప్రచారాలు నిర్వహించి.. ఫలితం ఎలా ఉండబోతుందో అన్న ఉత్కంఠతో ఎదురుచూసే.. రాజకీయ నాయకులు .. ఫలితాలకోసం.. 42రోజుల ఎదురుచూడటమంటే.. అవన్నీ వాళ్లకు నిద్రలేని రాత్రులే ...
కీలకమైన నామినేషన్ల ఘట్టం ప్రారంభం కావటంతో ఊరువాడా ఒకటే కోలాహలంగా కనిపిస్తోంది. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ప్రకటననూ శరవేగంగా పూర్తి చేసేస్తున్నాయి. వైకాపా ఇప్పటికే అభ్యర్ఖులందరినీ ప్రకటించేయగా.. తెదేపా కూడా 140మందికి పైగా అభ్యర్థులను ప్రకటించింది. గతంలో మాదిరిగా చివరి వరకూ వేచి చూడకుండా ముందుగానే అభ్యర్థులను ఖాయం చేస్తున్నాయి. ఫలితంగానే టిక్కెట్లు దక్కించుకున్న అభ్యర్థులంతా ఉత్సాహంగా ప్రచారం సాగిస్తున్నారు.
ఎంపీ, ఎమ్మెల్యే జాబితాలు మొత్తం ప్రకటించిన వైకాపాలో ఈ అసంతృప్తి జ్వాలలు కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నాయి. విశాఖలో పార్టీ కార్యాలయాల ధ్వంసం వరకూ వెళ్లారు. తెదేపా టికెట్ దక్కని కొందరు తిరుగుబాటు అభ్యర్థులుగా అయినా బరిలో నిలుస్తామని సంకేతాలు పంపుతున్నారు. ఈ పరిణామాలు ఎలా ఉన్నా రాష్ట్ర రాజకీయాలను తరచి చూస్తే మాత్రం ప్రధాన పోటీ తెలుగుదేశం-వైకాపా మధ్యనే కనిపిస్తోంది. వామపక్షాలు, బీఎస్పీల దన్నులతో దీటైన పోటీకి జనసేనాని కూడా సన్నద్ధం అవుతున్నా... ఆ 2పార్టీలు ఇప్పటికే ప్రచారబరిలో దూసుకెళ్తున్నాయి.
కొద్దిరోజులుగా రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలు ఆ రెండింటి మధ్య పోటీ ఇంకాస్త పెంచాయి. ఫారం -7 దరఖాస్తులు, డేటా చౌర్యం, పార్టీల్లోకి అటుఇటు చేరికలు, హింసాత్మక ఘటనలు ప్రచార అజెండాల్లో కీలక స్థానాలు ఆక్రమించాయి. తెదేపా-వైకాపాల మధ్య ప్రత్యక్షంగా జరుగుతున్న ప్రచార యుద్ధానికి తోడు.. సోషల్ మీడియా వార్ ఈ సారి ప్రధాన భూమిక వహించబోతోంది.
వరుసగా పదేళ్లు అధికారాన్ని చెలాయించిన కాంగ్రెస్ పార్టీ కిందటి ఎన్నికల్లో కనిపించకుండా పోయింది. పోటీ చేసిన 173స్థానాల్లో ఎక్కడా ఒక్కసీటు కూడా గెలవలేక పోయింది. వచ్చిన ఓట్లు కూడా కేవలం 2.77%. ఈ ఎన్నికల్లో ఆ లోటు కాస్తైనా పూడ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు కాంగేయులు..! కేంద్రంలో అధికారంలోకి వస్తే హోదా ఇస్తామన్న హామీపైనే ఆశలన్నీ పెట్టుకుని ప్రజల మధ్యకు వెళ్తున్నారు. కానీ ఒకరి వెంట మరొకరు ఉన్న సీనియర్లు కూడా పార్టీని విడిచి వెళ్ళి పోతుండటం.. ఆ పార్టీ పరిస్థితిని తెలుపుతోంది. భాజపా మాత్రం అన్నిస్థానాల్లో ఒంటరి పోరుకు సై అంది. ఇప్పటికే 120 మందికి పైగా అభ్యర్థులను ప్రకటించి రంగంలోకి దిగింది.