YCP leader Irregularities in Parchur Constituency: రేషన్ బియ్యం దారి మళ్లించాలా? ఆయన పనే అది. సెస్సు చెల్లించకుండా గ్రానైట్ లారీలు బోర్డర్ దాటించాలా? ఆయన దాటించేస్తారు. మట్టి, ఇసుక అక్రమంగా తరలించుకుపోవాలా? అది కూడా ఆయనే చూసుకుంటారు. సెటిల్మెంట్లు చేయాలాన్నా, ఆయన చేసేస్తారు. ఇంతకీ ఎవరాయన అనుకుంటున్నారా?
ఆయనో 'మాంచి' మాఫియా రాజ్. కప్పం కట్టనిదే ఆయన దగ్గర పని జరగదు. కమీషన్ల వసూళ్లకు ఓ ముఠానే పెట్టుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులైనా పన్నులు చెల్లింపులకు సమయం ఇస్తారేమోగానీ, వాళ్లకు మాత్రం నెలనెలా మామూళ్లు ఇవ్వాల్సిందే. లేదంటే వేధించి వడ్డీతో సహా వసూలు చేస్తారు. పర్చూరు నియోజకవర్గంలో ఆ అరాచక శక్తి ఆగడాలు బెంబేలెత్తిస్తున్నాయి.
ఆయన అక్రమాల లెక్కల చిట్టి వివరాలు: గ్రానైట్ లారీల అక్రమ రవాణాతో నెలకు కోటి 44 లక్షల రూపాయల నుంచి 2 కోట్ల 40లక్షల వరకు వసూళ్లు చేస్తున్నారు. మట్టి తరలించే వాహనాల వద్ద నెలకు ఇరవై రెండున్నర లక్షల దందా యథేచ్ఛగా సాగుతోంది. ఇసుక టిప్పర్ల వద్ద నెలకు రూ.కోటి దాకా కమిషన్లు దండుకుంటున్నారు. శీతల గిడ్డంగుల వద్ద నెలకో లక్ష వరకు వసూలు కొనసాగిస్తున్నారు.
ఇలా బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ప్రతీదానికీ ఆ నాయకుడికి ఓ రేటుంటుంది. అధికారం అండతో అక్కడో సమాంతర వసూళ్ల వ్యవస్థను ఆయన నడుపుతున్నారు. అందుకు 80 నుంచి 100 మంది ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
లేని తమిళనాడు వలస కూలీలకు ఓట్లు - ఫిర్యాదు చేసినా పట్టించుకోని బీఎల్వోలు
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాఫియా అవతారమెత్తి: వసూళ్లకు ఆయన రేటు ఫిక్స్ చేయగానే ఆయన ప్రైవేటు సైన్యం వెళ్లి వసూలు చేసుకొస్తారు. ఇలా అధికారాన్ని అడ్డం పెట్టుకుని, ఆ నాయకుడు ఓ మాఫియా అవతారమెత్తాడు. చిల్లరకొట్టు మొదలుకుని, చిరువ్యాపారుల వరకూ కప్పం కట్టలేక, కుదరని చెప్పలేక సతమతం అవుతున్నారు.
సకల శాఖల అధికారులను వాడుకుంటు: ఆదాయానికి తగినట్లే ఆయనకూ కమీషన్ కొట్టాలి. దళితుల్ని ముందు పెట్టడం, పోలీస్, రెవెన్యూ, పంచాయతీ, మైనింగ్ ఇలా సకల శాఖల అధికారులను వాడుకోవడం ఆ ఆరాచక నేత స్టైల్. గ్రానైట్ రవాణాలో కమీషన్లకు, ఓటరు జాబితాలో మార్పులు చేర్పులకు పోలీసుల్ని వినియోగించే స్థాయికి ఆయన అరాచకం వెళ్లింది.
రౌడీల్ని అడ్డం పెట్టుకుని స్థిరాస్తి వ్యాపారం - విశాఖలో పేట్రేగిపోతున్న వైసీపీ నేత
గ్రానైట్ లారీ కదలాలంటే సొమ్ము చెల్లించాల్సిందే : పర్చూరు మాఫియా రాజ్ అక్రమార్జనలో సింహభాగం గ్రానైట్‌దే. గ్రానైట్ రాళ్లను బిల్లుతో తీసుకెళ్తే జీఎస్టీ, మైనింగ్ సెస్ కట్టాల్సి ఉంటుంది. ఈ రెండూ కలిపి ఒక్కో లారీకి లక్ష రూపాయల వరకు అవుతుంది. ఐతే ఆ నేత గ్రానైట్ రవాణాదారులకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. 35వేలు ఇవ్వండి, లారీల్ని దర్జాగా బోర్డర్ దాటిస్తామని భరోసా ఇచ్చారు.
మార్టూరులో దాదాపు 450 గ్రానైట్ ఫ్యాక్టరీలున్నాయి. వీటి నుంచి నిత్యం 60 నుంచి వంద లారీలు లోడ్‌తో వెళ్తుంటాయి. ఫ్యాక్టరీ వద్ద లోడు ఎత్తగానే ఒక్కో వాహనానికి 35వేల చొప్పున ప్రైవేటు సైన్యం కమీషన్ వసూలు చేస్తుంది. ఇందులో ఆ నాయకుడు, పల్నాడులోని ఓ వైఎస్సార్సీపీ ముఖ్యనేత 8వేల రూపాయల చొప్పున పంచుకుంటారు.
ప్రణాళికబద్ధంగా అక్రమాలు : ఒక ప్రభుత్వ గుత్తేదారు సంస్థకు 7వేలు, వాహనాన్ని జిల్లా బోర్డర్ దాటించే వాళ్లకు 4వేలు చొప్పున ఇస్తారు. మిగిలిన 9వేలు మాత్రం పకడ్బందీగా గ్రానైట్ లారీల్ని బోర్డర్ దాటించే ప్రైవేటు సైన్యానికి పడేస్తారు. ఇదంతా ప్రణాళికాబద్ధంగా జరుగుతోంది. ఫ్యాక్టరీ వద్ద వాహనానికి 35వేలు వసూలు చేయగానే దాని నెంబరును ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న గ్రూప్‌లో కోడ్ భాషలో మెసేజ్ పెడతారు.
పశువైద్యశాల స్థలం కబ్జా, రోజురోజుకు తారస్థాయికి చేరుతున్న వైసీపీ అక్రమాలు
గ్రానైట్ అక్రమ రవాణాకు కొమ్ముకాస్తున్న పోలీసులు: ఆ వాహనాలే బోర్డర్ దాటుతాయి. లేదంటే మధ్యలో ఏర్పాటు చేసుకున్న 3చెక్‌పోస్టుల్లో పట్టేస్తారు. లోడుకు సంబంధించిన బిల్లుల్నీ వాళ్లే పరిశీలిస్తారు. అన్నీ సరిగా ఉంటే ఎంతో కొంత తీసుకొని వదిలేస్తారు. లేదంటే 35 వేలు కట్టేదాకా పీడిస్తారు. విచిత్రం ఏంటంటే పోలీసులూ పక్కనే ఉంటారు. వాళ్లూ ఆ అరాచకశక్తి గ్రానైట్ అక్రమ రవాణాకు కొమ్ముకాస్తారు. మార్టూరుకు నలువైపులా జాతీయ రహదారి వెంట ఉన్న సీసీ కెమెరాల ద్వారా గ్రానైట్ లారీల కదలికలు గుర్తిస్తుంటారు.
గ్రావెల్ కొండకు గుండు కొట్టారు: మట్టి అక్రమ రవాణాకూ ఆయనో రేట్ ఫిక్స్ చేశారు. మార్టూరు మండలం బొబ్బేపల్లి గ్రామ సర్వే నెంబర్ 387-సి 11లో 350 ఎకరాల్లో ఉన్న గ్రావెల్ కొండకు ఈ నేతే గుండు కొట్టేశారు. ఇక్కడి నుంచి రోజుకు సగటున 500 ట్రాక్టర్ల గ్రావెల్ తరలిస్తున్నారు. నిబంధనల ప్రకారం ట్రాక్టరుకు 150 రూపాయల చొప్పున ప్రభుత్వానికి సీనరేజీ చెల్లించాలి. కానీ బిల్లులు లేకుండా ట్రాక్టర్‌కు 800 రూపాయలు గుంజుతోంది ఆ అరాచక సైన్యం.
వైసీపీ నేతల మట్టి దోపిడీపై అధికారుల ఉదాసీనత! విప్ అండదండలతోనే తవ్వకాలన్న టీడీపీ నేత కాలవ
రేషన్ బియ్యం అక్రమ రవాణాకు : పర్చూరు నియోజకవర్గంలో రేషన్ బియ్యం రవాణా కూడా సదరు నేత కనుసన్నల్లోనే ఎక్కువగా జరుగుతోంది. నియోజకవర్గంలో 210 రేషన్ దుకాణాలుండగా బ్లాక్ మార్క్ మార్కెట్ ధర ప్రకారం ఒక్కో దాన్నుంచి 25వేల విలువైన బియ్యం ప్రతి నెలా కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలోని రైస్ మిల్లుకు చేరాల్సిందే.
స్వర్ణం గ్రామంలోని మిల్లుకు చేరుకున్న ఆ బియ్యాన్ని పాలిష్ చేసి, ఎగుమతి చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. బియ్యం అక్రమ రావాణాపై తనిఖీలకు వెళ్లిన విజిలెన్స్ అధికారులను అడ్డుకుని, వారి ఫోన్లు ధ్వంసం చేయడం ఆ నేత బరితెగింపునకు పరాకాష్ట.
వెంచర్‌కు అనుమతులంటే ఆయన్ను కలవాల్సిందే: స్థిరాస్తి వ్యాపారాన్నీ ఆ నేత గుప్పిట పట్టారు. వెంచర్ వేయాలంటే ముందుగా ఆయన్ను కలవాల్సిందే. అడిగినంత సమర్పించుకోవాల్సిందే. లేదంటే వెంచర్‌కు అనుమతులు రావు. అందులో ప్లాట్లు కొన్నా ఇళ్ల నిర్మాణాలకు అనుమతులివ్వరు. అందుకే మా వల్ల కాదంటూ కొత్త వెంచర్లు వేయడమే వ్యాపారులు మానేశారు.
Irregularities in Voter List దుకాణానికి ఇంటి నంబర్.. 100కి పైగా ఓట్లు! నంబరే లేని ఇంట్లో ఏకంగా 280..
ప్రవేటు సైన్యంతోనే ఓట్ల తొలగింపునకు ఫారం 7: నిజానికి వైఎస్సార్సీపీ మార్క్ అరాచకాలకు ఆయనే ఓ బ్రాండ్ అంబాసిడర్. ఓటరు జాబితా అక్రమాల్లోనూ ఆయన తెలివితేటలు ప్రదర్శించారు. నియోజకవర్గంలో ఏకంగా 14 వేల ఓట్లు తొలగించాలంటూ, బీఎల్‌ఏలతోపాటు తన ప్రైవేటు సైన్యంతోనే దొంగ ఫారం-7 దరఖాస్తులు చేయించారు. ఆ అరాచక నేత అక్రమాలకు కొమ్ముకాసి, ముగ్గురు పోలీసు అధికారులు సస్పెన్షన్‌కు గురయ్యారు.
పర్చూరు నియోజకవర్గంలో విధులంటే రెవెన్యూ అధికారులకు గుబులు: ఓట్ల అక్రమాల కోసం ఈ నేత ఒత్తిడి భరించలేక, యద్దనపూడి తహసీల్దారు బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైతే కారంచేడు తహసీల్దారు అనారోగ్యంతో సెలవు పెట్టి వెళ్లిపోయారు. పర్చూరు తహసీల్దారు కార్యాలయంలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సీనియర్ అసిస్టెంట్ ఒకరు గుండెపోటుకు గురయ్యారు. మాట వినడంలేదంటూ మార్టూరు తహసీల్దారును బాధ్యతలు చేపట్టిన 20రోజులకే అక్కడి నుంచి బదిలీ చేయించారు. ఈ పరిణామాలతో పర్చూరు నియోజకవర్గంలో పోస్టింగ్ అంటేనే అధికారులు బెంబేలెత్తిపోతున్నారు.
Illegal Sand Mining: వైసీపీ నేతల అక్రమాలు.. గుత్తేదారు ముసుగులో ఆగని ఇసుక దోపిడి..