గత ఎన్నికల్లో వైకాపాకు ఓటు వేసి మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించినందుకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మంజూరు చేయకుండా తనకు బాగా మంచి చేశారంటూ.. శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి ఎదుట బాపట్లకు చెందిన వితంతువు.. యాసం శివలీల చెంపలేసుకుని తన ఆవేదన వ్యక్తం చేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎస్‌ఎన్‌పీ అగ్రహారంలోని శివలీల ఇంటి వద్దకు కోన వచ్చి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు.
ఈ సందర్భంగా శివలీల చేతులు జోడించి మాట్లాడుతూ.. ‘అయ్యా! ఈ ప్రభుత్వం వచ్చాక ఇళ్ల స్థలం, పక్కా గృహం, కాపు నేస్తం పథకం ఇవ్వలేదు.. అయినా బాధలేదు.. గతం నుంచి వస్తున్న వితంతు పింఛన్‌ను తొలగించి అన్యాయం చేశారు.. పింఛన్ ఎందుకు ఇవ్వడం లేదని అధికారులను అడిగితే మీ అబ్బాయికి కారు ఉంది. అందుకే రద్దు చేసినట్లు చెప్పారు’ అని పేర్కొన్నారు.
ఆర్టీఏ అధికారుల నుంచి తనకు కారు లేదని రెండుసార్లు పత్రాలు తెచ్చి సచివాలయ సిబ్బందికి ఇచ్చినా తన తల్లి పింఛన్‌ను పునరుద్ధరించలేదని.. శివలీల కుమారుడు రమేష్ వాపోయారు. భర్త మరణించారని, ఏ ఆధారం లేని పేద కుటుంబం తనదని, పింఛన్ తీసేస్తే ఎలా బతకాలని ఆమె ప్రశ్నించారు. దీనిపై రఘుపతి స్పందిస్తూ.. నవంబరు వరకు ఆగాలని, కొత్త పింఛన్ వస్తుందని చెప్పారు.
‘రెండేళ్ల నుంచి సచివాలయ ఉద్యోగులు ఇదే సమాధానం చెప్పి వెళ్లిపోతున్నారు. ఓటు వేసి ఎన్నికల్లో గెలిపించినందుకు బాగా మేలు చేశారు..’ అని శివలీల పేర్కొన్నారు. మీరు తనకు ఎప్పుడు ఓటు వేశారని కోన ఎదురు ప్రశ్నించి వెళ్లిపోయారని శివలీల వాపోయారు.
ఇవీ చూడండి: