Vijayasai Reddy Meeting with YSRCP Leaders: వైసీపీ ముఖ్యనేత, ప్రాంతీయ సమన్వయకర్త విజయసాయిరెడ్డి బాపట్లకు వచ్చారు. పార్టీలో అంతర్గతంగా నెలకొన్న విభేదాల పరిష్కారం కోసం బాపట్లలోని ఓ హోటల్‌లో జిల్లా ప్రజాప్రతినిధులు, పార్టీ బాధ్యులు, నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. వైసీపీ జిల్లా కన్వీనర్, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావుతో మొదట సమావేశమై జిల్లాలో పార్టీ పరిస్థితి సమీక్షించారు.
Vijayasai reddy Meeting with Amanchi Krishna Mohan: అనంతరం పర్చూరు వైసీపీ బాధ్యుడు ఆమంచి కృష్ణమోహన్‌తో భేటీ అయ్యారు. చీరాలలో ఎమ్మెల్యే కరణం బలరాం, పార్టీ బాధ్యుడు వెంకటేష్‌తో వివాదాలపైన చర్చ జరిగింది. రామన్నపేట గ్రామ పంచాయతీ వార్డు ఉప ఎన్నికల వ్యవహారంలో పార్టీ ఇన్‌ఛార్జి కరణం వెంకటేష్ వల్లే ఘర్షణలు జరిగినట్లు ఆరోపించినట్లు సమాచారం. వర్గ విభేదాలు పక్కనపెట్టి పార్టీ నేతలందరినీ కలుపుకుని పని చేయాలని, పర్చూరు విషయంలో సీఎం జగన్ త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటారని చెప్పినట్లు సమాచారం.
Vijayasai Meeting with Karanam Balaram: ఆ తర్వాత చీరాల ఎమ్మెల్యే బలరాం, తన కుమారుడు వెంకటేష్‌తో కలిసి విజయసాయి రెడ్డి భేటి అయ్యారు. చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ జోక్యం చేసుకుని వివాదాలు సృష్టిస్తున్నారని ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఆమంచి సోదరుడు స్వాములు జనసేనలోకి వెళ్లినా ఇద్దరూ కలిసే రాజకీయం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. పర్చూరు బాధ్యుడిగా ఉన్న కృష్ణమోహన్‌కు చీరాలలో పనేంటని అడిగారు. పేదలకు ఇళ్ల స్థలాలకు ఇవ్వకుండా అడ్డుకోవటం ద్వారా పార్టీకి చెడ్డపేరు తేవాలని చూస్తున్నారని పేర్కొన్నారు.
ఆమంచి తీరు వల్లే: ఎంపీ నందిగం సురేష్‌తో జరిపిన భేటీలో సైతం పర్చూరు పంచాయతీ గురించే చర్చ జరిగినట్లు సమాచారం. బాధ్యుడు ఆమంచి తీరు వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల నేతలు పార్టీకి దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని విజయసాయికి ఎంపీ చెప్పినట్లు తెలిసింది. కృష్ణమోహన్ వల్ల ఇబ్బంది పడ్డ నేతలకు భవిష్యత్తులో ఎలాంటి వేధింపులు లేకుండా చూడాలని కోరారు. వర్గ విభేదాలు ప్రోత్సహించకుండా అందరినీ కలుపుకుపోయేలా చూడాలన్నారు.
మరింత బలంగా తీసుకెళ్లాలి: మంత్రి మేరుగ నాగార్జునతో సమావేశమై వేమూరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి మరింతగా కృషి చేయాలని సూచించారు. వైసీపీ మద్దతుగా ఎస్సీ, ఎస్టీల్లో పార్టీ వాణిని మరింత బలంగా తీసుకెళ్లాలని విజయసాయి పేర్కొన్నారు. జిల్లాలో పార్టీ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాలని చెప్పారు. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతితో జరిపిన భేటీలో అందరినీ కలుపుకుపోయి పార్టీ బలోపేతానికి పని చేయాలని సూచనలు చేశారు. దూరంగా ఉన్న నేతలతో మాట్లాడి క్రియాశీలంగా పని చేయాలని పేర్కొన్నారు.
గందరగోళానికి గురి చేస్తున్నారు.. కట్టడి చేయాలి: కొందరు నేతలు ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుకుంటూ, అధికారులను బెదిరింపులకు గురి చేస్తూ పార్టీలో గందరగోళం సృష్టించటానికి ప్రయత్నిస్తున్నారని వారిని కట్టడి చేయాలని ఎమ్మెల్యే కోన ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అద్దంకి పార్టీ బాధ్యుడు బాచిన కృష్ణచైతన్య నిర్వహించిన భేటీలో నియోజకవర్గంలో వైసీపీ బలాలు చర్చించారు. అద్దంకిలో బయట నేతల జోక్యం లేకుండా చూడాలని, ఎత్తిపోతల పథకాలు, అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించాలని కోరారు.