protesting farmers taken to the police station: తమకు పంటరుణాలు ఇవ్వాలంటూ రోడ్డెక్కిన కౌలురైతులను అరెస్టు చేసిన పోలీసులు.. వారిని నేలపై కూర్చోబెట్టి అవమానించారు. ఈ ఘటన బాపట్ల జిల్లా కొల్లూరులో బుధవారం చోటుచేసుకుంది. రైతులు రాస్తారోకో చేస్తున్న దారి మీదుగానే మంత్రి మేరుగు నాగార్జున వెళ్లాల్సి ఉండటంతో పోలీసులు అత్యవసరంగా వారిని వాహనాల్లో పోలీసు స్టేషన్‌కు తరలించారు. అక్కడ సాధారణ నిందితుల్లా నేలపై కూర్చోబెట్టారు. అక్కడి నుంచే రైతులు కాసేపు ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. అనంతరం ‘మమ్మల్ని వదిలిపెడతారా? భోజనాలు పెడతారా?’ అంటూ స్టేషన్లో నినాదాలు చేశారు. మంత్రి వెళ్లిపోయిన తర్వాత మధ్యాహ్నం 2గంటలకు సొంత పూచీకత్తుపై కౌలు రైతులను పోలీసులు విడుదల చేశారు.
ఖరీఫ్ పంటకాలం ముగుస్తున్నా రుణాలందక కౌలు రైతులు ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. తమ మొర ఆలకించేవారే లేరని కౌలు రైతు సంఘం బాపట్ల జిల్లా అధ్యక్షుడు తోడేటి సురేష్ పేర్కొన్నారు. కొల్లూరు ప్రధాన రహదారిపై పంటరుణాల మంజూరు కోరుతూ ఆందోళనకు దిగిన రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కౌలు రైతు ధ్రువపత్రాలు పొందిన సాగుదార్లకు పంటరుణాలు ఇవ్వకపోగా బ్యాంకు మేనేజర్లు, సిబ్బంది ఈసడించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగే వ్యవహరిస్తే బ్యాంకుల ముందే బైఠాయిస్తామని ఆయన హెచ్చరించారు.
రాకపోకలకు ఆటంకం కలిగించారంటూ..
కౌలురైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తోడేటి సురేష్, జంపాని వెంకటప్రసాద్, సనకా వెంకటేశ్వర్లు (అగ్గిరామయ్య) సహా మొత్తం 9మంది రైతు నాయకులపై కేసు నమోదుచేసినట్లు ఏఎస్సై రామయ్య తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా రహదారిపై కూర్చుని స్థానికుల రాకపోకలకు ఇబ్బంది కలిగించారని అభియోగం మోపినట్లు ఆయన చెప్పారు.
ఇవీ చదవండి: