Road Accidents : ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన శ్రీ సత్య సాయి జిల్లాలో చోటు చేసుకుంది. గోరంట్ల మండల కేంద్రంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో ఒకరిని బెంగళూరుకు తరలించారు. మరో ఇద్దరిని హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మురళి(18) మృతి చెందాడు. నరసింహులు అనే వ్యక్తి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురంకి తరలించారు. ఈ ఘటనలో గాయపడ్డ ముగ్గురిలో ఒకరు మృతి చెందగా ఇద్దరు తీవ్ర గాయాలు పాలై వేరు వేరు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన మినీ లారీ : ఇద్దరూ యువకులు కలసి ద్విచక్ర వాహనంపై వెళుతుండుగా మినీ లారీ ఢీ కొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు పల్నాడు జిల్లా యడ్లపాడు మండలానికి చెందిన హనుమంతు రావు(18) తాఫీ పని చేస్తుంటాడు. నెల రోజుల క్రితం తమ బంధువులు ఇంటికి వేమూరిపాడు వచ్చాడు.
అదే గ్రామానికి చెందిన డాని, ఇద్దరూ కలిసి ద్విచక్ర వాహనంపై వేములూరిపాడు నుంచి ఫిరంగీపురం బయలుదేరారు. గ్రామ శివారు వద్దకు వెళ్లారు. అదే సమయంలో ఫిరంగీపురం నుంచి వేములూరిపాడు వెళుతున్న మీనీ లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో హనుమంత రావు మృతి చెందాడు. గాయపడిన డానిని చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. శవ పంచనామా నిమిత్తం మృతదేహం నరసరావుపేట ప్రాంతీయా ఆసుపత్రి తరలించారు. మినీ లారీ డ్రైవర్ అక్కడ నుంచి పరారీ అయ్యాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సుంకులమ్మ ఆలయంలో దొంగలు : నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో దొంగలు బీభత్సం సృష్టించారు. కూరగాయలు మార్కెట్లోని మూడు కిరాణా షాపులు, మున్సిపల్ కార్యాలయం ఎదుట రెండు షాపుల్లో దొంగలు శుక్రవారం రాత్రి షటర్ల తాళాలు పగులగొట్టి దోచుకెళ్లారు. పట్టణంలోని రెండు ప్రధాన రహదారుల్లోనే ఈ ఘటనలు జరగాయి. ఉగాది పండుగ మరుసటి రోజు పట్టణ సమీపంలోని కరిటికొండ సుంకులమ్మ ఆలయంలో అమ్మవారి బంగారు పుస్తెల తాడు, వెండి కిరీటం, హుండీలో ఉన్న కానుకలను దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మరువక ముందే శుక్రవారం పట్టణంలో షాపులు చోరీకి గురయ్యాయి. వరుస ఘటనలతో పట్టణ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసుల నిఘా వైఫల్యాల వల్లే వరుస దొంగతనాలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఇవీ చదవండి