Police Arrested the Accused in the Theft Case: బాపట్ల జిల్లాలో సంచలనం రేపిన భారీ దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. చోరీ జరిగిన వివరాలను బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. మోదుకూరుకు చెందిన వెంకటరమణారెడ్డి ఇంట్లో నవంబర్ 9వ తేదీన చోరీ జరిగింది. ఆ సమయంలో వెంకటరమణారెడ్డి దంపతులు ఇంట్లో నిద్రిస్తున్నారు. అయితే ఉదయాన్నే లేచి చూసేసరికి.. వేరే గదిలో తలుపులు తీసి ఉండటాన్ని గమనించారు. ఒక గది తాళం గడియ విరగగొట్టి.. తాళం కప్ప నేలపై పడి ఉంది. గదిలోకెళ్లి చూడగా అలమర, బీరువాలో సామాన్లు చిందరవందరగా పడి ఉన్నాయి. దీంతో ఇంట్లో చోరీ జరిగిందని గమనించారు. బీరువాలో ఉండాల్సిన సుమారు కిలోన్నర బంగారు ఆభరణాలు, కిలో వెండి పూజా సామాగ్రి, 12000 డబ్బులతో పాటు ఓ టీవీ చోరీకి గురైనట్లు గుర్తించారు. వెంటనే బాధితులు చుండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్న సొత్తు: దొంగతనంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు. తాడేపల్లి మండలం చిర్రావూరుకు చెందిన తాతా ప్రసాద్, బాపట్ల మండలం చిన బేతపూడికి చెందిన దేవర అబ్బన్న అలియాస్ వర్మను అరెస్టు చేశారు. నిందితులు గతంలో కూడా పలు ఇళ్లలో చోరీలు, బైక్‌లను దొంగతనం చేసినట్టు ఎస్పీ తెలిపారు. నిందితుల నుండి 60 లక్షల రూపాయలు విలువచేసే సొత్తు, మూడు బుల్లెట్లు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. ఈ 60 లక్షల సొత్తులో 600 గ్రాముల బంగారం, కిలో వెండి వస్తువులు, 18 లక్షల విలువైన ఆస్తులు కొన్నట్లు గుర్తించి.. వాటిని స్వాధీనం చేసుకున్నారు.
దొంగ.. దొంగకి కారు డ్రైవర్: దేవర అబ్బన్న అనే వ్యక్తి తాతా ప్రసాద్‌కు.. కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. అదే విధంగా వీరి వద్ద నుంచి మూడు విలువైన బైకులను సైతం స్వాధీనం చేసుకున్నారు. కేసు పురోగతిలో ప్రతిభ కనబరిచిన పలువురు పోలీసులకు ఎస్పీ రివార్డులను అందచేశారు. చోరీ వివరాలను ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాకు వివరించారు.
ఇవీ చదవండి: