జగన్ కేబినెట్లో మంత్రి పదవులు దక్కని అసంతృప్తుల తీరుపై రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆశావాహులకు పదవులు ఇవ్వాలంటే కొత్తగా పదవులను సృష్టించుకోవాలని అన్నారు. కేబినెట్ విస్తరణ సమయంలో ఆశావాహుల్లో అసంతృప్తి రావడం సహజమేనని వ్యాాఖ్యానించారు. బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన..150పై చిలుకు ఉన్న శాసన సభ్యుల్లో 25 మంది మంత్రులను ఎన్నుకునే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుందన్నారు. అన్ని పరిగణలోకి తీసుకునే మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు.
కేబినెట్లో 75 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారికి ప్రాధాన్యత కల్పించినట్లు మోపిదేవి వెల్లడించారు. పదవులు రాని వారికి అదే హోదాలో పదవులు ఇవ్వాలంటే సాధ్యపడదని వివరించారు. ముఖ్యమంత్రి జగన్ చొరవతో అన్ని సద్దుమణిగాయని అన్నారు. బీసీ వర్గాలను అన్యాయం చేశారని తెదేపా నేతలు అనడం సరికాదని ఆయన హితవు పలికారు. ప్రతి జిల్లా నుంచి బీసీలకు ప్రాధాన్యం ఇచ్చి పదవులు అప్పజెప్పినట్లు చెప్పారు. తెదేపా హయంలో బీసీలను ఓటు బ్యాంక్‌గా వినియోగించుకున్నారని మోపిదేవి ఆరోపించారు.
ఇదీ చదవండి: తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యేల అసంతృప్తి వ్యవహారం