Cyclone Michaung Damaged Crops: మిగ్‌జాం తుపాను రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. తుపాను ప్రభావంతో లక్షల ఎకరాల్లో కోతకు వచ్చిన పంటలు నీటమునిగాయి. ఉద్యాన పంటలు నేలకొరిగాయి. తుపాను వల్ల ధాన్యం రాశులు తడిసిపోయి మొలకలు వచ్చాయి. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని ఉత్త చేతులతో మిగిలామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవడం, ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం వల్లే తీవ్రంగా నష్టపోయామని వాపోతున్నారు.
మిగ్‌జాం తుపాను సృష్టించిన బీభత్సం నుంచి రైతులు ఇంకా కోలుకోలేదు. నష్టపోయిన కర్షకులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బాపట్ల జిల్లా రైతులు ఆరోపించారు. రైతుల నుంచి నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. వరి, మొక్కకొన్న, మినుము పొలాల్లో ఇంకా మోకాలి లోతులో నీరు ఉందని, తాము పూర్తిగా నష్టపోయాని, కనీసం ప్రజాప్రతినిధులు, అధికారులు పలకరించలేదని రైతులు ఆవేదన చెందారు.
నిండా ముంచిన మిగ్‌జాం తుపాను - ఆందోళనలో రైతులు
నీటమునిగిన పంటను టీడీపీ నేతలు సందర్శించారు. కాలువల్లో పూడికలు తీయకపోవడంతో వరద ముంచెత్తి ధాన్యం నీటిపాలైందని ఏలూరు జిల్లా తల్లాపురం రైతులు మండిపడ్డారు. ప్రభుత్వం నిబంధనలు సడలించి తడిసిన ధాన్యానికి మద్దతు ధర ప్రకటించాలని వేడుకుంటున్నారు. నెల్లూరు జిల్లాలో తుపాను రైతులను నిండా ముంచింది. చేతి కొచ్చిన పంట నేలకొరగడంతో కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని మొక్కజొన్న రైతులు లబోదిబోమంటున్నారు.
రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ గుంటూరు జిల్లా రేవేంద్రపాడు వద్ద రైతులు మెడకు ఉరితాళ్లు బిగించుకుని నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇంత వరకు పంట నష్టం అంచనాకు రాలేదని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు తహశీల్దార్ కార్యాలయం వద్ద కౌలు రైతులు ధర్నా చేపట్టారు. తుపాను ధాటికి మిర్చి, వరి పైర్లు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి పరిహారం చెల్లించాలని కౌలు రైతులు కోరారు.
తడిసిన ధాన్యం ఆరబెట్టుకోవడానికి స్థలం లేదు - అధికారుల జాడ లేదు
చివరి ప్రయత్నాలు: అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలో వందల ఎకరాల్లో వరి పంట దెబ్బతిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. తుపాను తగ్గినప్పటికీ రైతులు మాత్రం నేటికీ తేరుకోలేదు. పొలాల్లో చేరిన నీటిని దారి మళ్లించేందుకు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకొని చేయూతనివ్వాలని రైతులు విన్నవించుకుంటున్నారు.
ఆత్మహత్యలే శరణ్యం: అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం పరిధిలో వరి పంట ఇంకా ముంపులోనే ఉంది. పంట కుళ్లిపోయి మొలకలు వస్తోందని రైతులు వాపోతున్నారు. అయినవిల్లి మండలంలో ఇప్పటివరకు వరి కోతలు పూర్తి కాలేదు. వరి పొలాలు ఇంకా ముంపు నీటిలోనే ఉన్నాయి. ధాన్యం కొనుగోలుకు అధికారులు నిబంధనల పేరుతో ఇబ్బందులు గురి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని వాపోతున్నారు.
నట్టేట ముంచిన తుపాను - తీవ్రంగా దెబ్బతిన్న పంటను చూసి రైతుల కన్నీరు