Dead Body Shifted on Rickshaw : రైలు కిందపడి మృతి చెందిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం రైల్వే పోలీసులు రిక్షాలో తరలించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.. ఈ ఘటన బాపట్ల జిల్లా కేంద్రంలో జరిగింది. పొన్నూరు సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు.. మృతదేహాన్ని బాపట్ల ప్రాంతీయ ఆసుపత్రి శవాగారానికి రైల్వే పోలీసులు తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు, బందువులు ఎవరూ రాకపోవడంతో రైల్వేపోలీసులు అక్కడినుంచి మృతదేహాన్ని ఓ రిక్షాపై శ్మశానవాటికకు తరలించారు. ఈ వ్యవహారంలో రైల్వేపోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.
పురపాలక సంఘం అధికారులకు సమాచారం అందిస్తే అంతిమయాత్ర వాహనంలో శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఇలా రిక్షాపై మృతదేహాన్ని తీసుకెళ్లడం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు సంబందించి బాపట్ల జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ మున్సిపాల్ అధికారులు, ఆసుపత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. మరోవైపు పట్టపగలు వాహనాలు తిరుగుతున్న సమయంలో బహిరంగంగా రిక్షాలో మృతదేహం వెళ్తుండటంతో.. ఆ రోడ్డు మార్గంలో ప్రయాణిస్తున్న వాహనదారులు భయాందోళనకు గురయ్యారు.
బాపట్ల.. ప్రత్యేక జిల్లా కేంద్రమైన తరువాత ఎంతో అభివృద్ధి చెందిందని గొప్పలు చెప్పుకునే నాయకులు, అధికారులు.. గుర్తు తెలియని అనాథ మృతదేహాలను.. ఇలా రిక్షాపై జనసంచారం మధ్య నుంచి ప్రజలు భయపడేటట్లు శ్మశానవాటికకు తరలించటం ఎంతవరకు సమంజసం అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
ఇవీ చదవండి: