Vellaturu Temple Renovation: ఆ గ్రామస్తులకు శ్రీరాముడంటే ఎంతో భక్తి. ఆయన అండతోనే ఊరు అభివృద్ధి చెందుతుందని, రామయ్య చల్లని చూపులతోనే తాము సుఖశాంతులతో జీవిస్తున్నామని వారి నమ్మకం. వందేళ్ల నాడు నిర్మించిన రాముల వారి ఆలయం శిథిలావస్థకు చేరటంతో ఇప్పుడు ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నారు. చారిత్రక ఆలయాన్ని ఆధునిక హంగులతో తీర్చిదిద్దుతున్నారు. బాపట్ల జిల్లా వెల్లటూరులో గ్రామస్థులు సమైక్య స్ఫూర్తితో నిర్మిస్తోన్న శ్రీరాముని ఆలయంపై ప్రత్యేక కథనం.
శిథిలావస్తకు ఆలయం .. అభివృద్ధి: బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం వెల్లటూరులో కోదండరాముని ఆలయం శిథిలావస్తకు చేరింది. దాదాపు వందేళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయంలో అప్పటి నుంచి నిత్యం దూపదీప నైవేద్యాలకు కొదవలేదు. గ్రామస్తుల సహకారంతో అంచెలంచెలుగా ఆలయాన్ని అభివృద్ధి చేశారు. గ్రామంలో ఎన్నో ఆలయాలు ఉన్నా కోదండ రాముని కోవెల అంటే ప్రతి ఒక్కరికీ ఎంతో ఇష్టం.
శ్రీరామనవమి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించేవారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో రామయ్య సన్నిది ఎంతో సందడిగా ఉండేది. అయితే కాల క్రమంలో ఆలయం శిథిలావస్తకు చేరడంతోపాటు సిమెంట్ రోడ్డు ఎత్తుగా నిర్మించడంతో ఆలయ ప్రాంగణం పల్లంగా మారింది. వర్షపు నీరు గుడి ఆవరణలోకి చేరుతుండటంతో రాముని ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేయాలని గ్రామస్తులు నిర్ణయించారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయంలోని విగ్రహాలను మరొక చోటకి తరలించి గుడిని కూల్చివేశారు. అత్యాధునిక హంగులతో మళ్లీ పునర్నిర్మాణం చేపట్టారు. కోదండ రాముని ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యులు కావడం ఎంతో ఆనందంగా ఉందని గ్రామస్తులు తెలిపారు.
రెండు వందల ఏళ్లు .. ఆలయ నిర్మాణం : గ్రామస్తులు చందాలు వేసుకుని గుడి నిర్మాణం చేపట్టారు. దాతల నుంచి విరాళాలు సేకరించారు. ఇక్కడే పుట్టి పెరిగి ఆలయంతో అనుబందం ఏర్పరుచుకుని వివిధ దేశాల్లో స్థిరపడిన వారంతా ఆలయ అభివృద్ధికి ముందుకు వస్తున్నారు. మరో రెండు వందల ఏళ్ల పాటు ఇబ్బంది లేకుండా ఉండేలా ఆలయ నిర్మాణం చేపట్టినట్లు గ్రామస్తులు తెలిపారు.
విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు: శరవేగంగా ఆలయ నిర్మాణ పనులు పూర్తి అవుతుండటంతో త్వరలోనే విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు నిర్వహించనున్నారు. ప్రతి రోజూ ఆధ్యాత్మక కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇవీ చదవండి