Vande Bharat trains in telugu states: సికింద్రాబాద్-విజయవాడ మార్గంలో వందేభారత్ రైళ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. ఆ దిశగా రైల్వే బోర్డుతో... రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులు సంప్రదింపులు చేస్తున్నారు. ఏపీ విభజన అనంతరం ఉద్యోగుల సౌకర్యం కోసం.. దక్షిణ మధ్య రైల్వేశాఖ ఇంటర్ సిటీ రైళ్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇరు రాష్ట్రాల్లోని ఉద్యోగులు రాకపోకలు సాగించేలా వాటిని నడిపిస్తున్నారు. ఐదు ఇంటర్‌సిటీ రైళ్లతోపాటు, విజయవాడ మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే రైళ్లు సుమారు 20 వరకు ఉంటాయి. ఇంటర్ సిటీ రైళ్లలో కొన్ని బీబీనగర్, నడికుడి మీదుగా విజయవాడ నుంచి గుంటూరు వరకు నడుస్తున్నాయి. మరికొన్ని విజయవాడ వరకు మాత్రమే నడుస్తున్నాయి.
సికింద్రాబాద్-విజయవాడ మధ్య రోజూ 25వేల మందికిపైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారని దక్షిణమధ్య రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వందేభారత్‌ను ప్రవేశపెడితే ఆదరణ బాగుంటుందని రైల్వేశాఖ అంచనా వేసింది. సికింద్రాబాద్ నుంచి కాజీపేట్ మీదుగా... విజయవాడ మార్గాన్ని హైడెన్సిటీ నెట్‌వర్క్ పరిధిలోకి తీసుకొచ్చారు. 130 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించేలా ఈ మార్గం ట్రాక్ సామర్థ్యం పెంచారు. ప్రస్తుతం హైడెన్సిటీ నెట్‌వర్క్ రూట్లలోనే వందేభారత్ రైళ్లు నడుస్తున్న దృష్ట్యా... సికింద్రాబాద్-విజయవాడ మార్గానికే అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వందేభారత్ రైళ్లు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో పరుగులు పెట్టనున్నట్లు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు. వందేభారత్ రైళ్లను అవసరమైతే తిరుపతి వరకు పొడిగించేలా రైల్వేశాఖకు ప్రతిపాదనలు చేస్తామని తెలిపారు.
ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి విజయవాడకు సుమారు 6 గంటల సమయం పడుతోంది. బీబీనగర్-నడికుడి మార్గంలో జాప్యం చోటు చేసుకుంటోంది. రైళ్ల రద్దీ, లైన్లపై పెరిగిన ఒత్తిడి వల్ల ఎక్స్‌ప్రెస్ రైళ్లు సైతం గంటకు 80కిలోమీటర్ల వేగంతో వెళ్లట్లేదు. ట్రాక్‌సామర్థ్యం పెంచినందున సికింద్రాబాద్-కాజీపేట్-విజయవాడ మార్గంలో వందేభారత్‌ను నడపడం వల్ల నాలుగు గంటల్లో విజయవాడకు చేరుకోవచ్చని రైల్వేశాఖ అంచనా వేస్తోంది. హైదరాబాద్-విజయవాడ మధ్య నిత్యం రాకపోకలు సాగించే వేలాది మందికి ఊరట లభిస్తుందని దక్షిణ మధ్య రైల్వే భావిస్తోంది.
ఇవీ చదవండి: