Tomato farmers are suffering: వేసవిలో టమాటాకు గిరాకీ ఉంటుందని ఆశించిన రైతులకు నిరాశే ఎదురైంది. నెల రోజులుగా గిట్టుబాటు ధర లేక టమాటాలను తోటల్లోనే వదిలేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి సాగు చేసుకున్న టమాటా పంటపైనే రైతుల జీవితాలు ఆధారపడి ఉన్నాయి. టమాటా పంట నుంచి వచ్చే ఆదాయమే వారికి ఆధారం. కానీ ఇప్పుడీ పరిస్థితితో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
నడి వేసవి వచ్చిందంటే టమాటాకు మంచి గిరాకీ ఉంటుందని ఆశించిన రైతులు.. రాయలసీమ జిల్లాలలో అధికంగా టమాటా పంటను సాగు చేశారు కానీ.. గత నెల రోజులుగా మార్కెట్లో గిట్టుబాటు ధరలు లేకపోవడంతో కోతకు వచ్చిన పంటను కోసి మార్కెట్‌కు తరలించేందుకు రైతులు వెనుకాడుతున్నారు. 30 కిలోల టమాటాల పెట్టె.. మార్కెట్లో కనీసం వెయ్యి రూపాయలు కూడా ధర పలకడం లేదని వాపోతున్నారు. ఫలితంగా కోత కూలీలు, మార్కెట్‌కు తరలించే ఆటో రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో అప్పు చేయాల్సి వస్తోందని.. చేసేదేమీ లేక కాయలను కోయకుండా తోటలోనే వదిలేస్తున్నారు.
అధికంగా సాగు చేస్తున్న జిల్లాలు.. పంట పక్వానికి వచ్చినా కోయకపోవడంతో.. చేల నిండా ఎర్రగా పండి రాలిపోతున్నాయి. ధరలు ఉన్న సమయంలో వ్యాపారుల తోట వద్దకు వచ్చి దిగుబడిని కొనుగోలు చేసేవాళ్లని.. ఇప్పుడు మార్కెట్లో ధరలు పడిపోవడంతో.. కాయల ధర తగ్గించి ఇస్తామన్నా.. ఎవరూ ముందుకు రావడం లేదని రైతులు వాపోతున్నారు. చిత్తూరు జిల్లా, అన్నమయ్య జిల్లా, వైయస్సార్ కర్నూలు జిల్లాలలో టమాటా పంటను అధికంగా సాగు చేస్తున్నారు. ఇక్కడ దిగుబడులన్నీ మదనపల్లి, హైదరాబాద్, చెన్నై, గుర్రంకొండ, కలకడ మార్కెట్లకు తరలిస్తారు.
మార్కెట్‌కు తరలించలేక.. తోట వద్దే పడేస్తున్న రైతులు.. చిత్తూరు, అన్నమయ్య జిల్లాలలో అత్యాధునిక వ్యవసాయ విధానంతో పంటను సాగు చేయడంతో పెట్టుబడి ఖర్చులు ఎకరాకు రూ. రెండు లక్షల వరకు అవుతోందని.. మార్కెట్లో ధరలు లేకపోవడంతో.. కనీసం 50 వేలు కూడా చేతికి అందని పరిస్థితి వచ్చిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. గత నాలుగు రోజులుగా అన్నమయ్య జిల్లా చిన్నమండెం సంబేపల్లి మండలాల్లోని టమాటా రైతులు.. కోసిన కాయలను మార్కెట్‌కు తరలించలేక తోట వద్దనే పడేస్తున్నారు. చిన్నమండ మండలం రెడ్డివారిపల్లె కేశాపురం గ్రామంలో రామ్మోహన్ అనే రైతు రెండు టన్నుల టమాటాలను కడప, బెంగళూరు హైవే పక్కనే పడేసి వెళ్లిపోయారు.
ఈ టమాటా పంటపైనే ఆధారపడి ఉన్నాము. పెట్టుబడులు అయితే భారీగా అయ్యాయి.. కానీ గిట్టుబాటు ధర లేదు. అలానే వదిలే పరిస్థితి వచ్చింది. కాయలు మంచిగా ఉన్నా కూడా ధర పలకడం లేదు.- నాగేంద్ర, రైతు
టమాటా పంటపై ఈ సారి చాలా నష్టపోయాం.. మార్కెట్‌కు వెళ్లినప్పుడు బాక్స్‌కు 75 రూపాయలు వేశారు. ఆ తరువాత వంద రూపాయలు వేశారు.. మాకు గిట్టుబాటు ధర లేక పోవడంతో కాయలు కోయడం మానేశాం.- ఓబులేసు, రైతు
ఇవీ చదవండి: