Telangana State Tax Revenue : తెలంగాణ రాష్ట్రంలో పన్నుల రాబడి ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబరు నాటికి రూ.80,853 కోట్లకు (అంచనాల్లో 64%) చేరింది. పన్నేతర ఆదాయం రూ.9,138 కోట్లు (అంచనాల్లో 36%) సమకూరింది. అలానే రాష్ట్ర రుణాల లక్ష్యంలో 50% పూర్తయింది. నవంబరు నెలాఖరు వరకూ రాష్ట్ర రాబడులు, వ్యయం వివరాలను రాష్ట్ర ఆర్థికశాఖ కాగ్‌కు నివేదించింది. దీని ప్రకారం రాష్ట్ర ఖజానాకు మొత్తం రాబడి అంచనాల్లో 50% రాగా.. వ్యయం అంచనాల్లో 50% పూర్తయింది.
రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ద్వారా జీఎస్టీ, అమ్మకం పన్ను రూపంలో రూ.46,857 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి పన్నుల వాటా అంచనాల్లో 61% వచ్చింది. గ్రాంట్ ఇన్‌ఎయిడ్ రూ.41 వేల కోట్లు వస్తుందని అంచనా వేయగా, రూ.6,623 కోట్లు (అంచనాల్లో 16%) మాత్రమే అందిందని, ఇది పూర్తి నిరాశాజనకంగా ఉందని ఆర్థికశాఖ తెలిపింది. మరోవైపు వేతనాలు, వడ్డీల చెల్లింపులు అంచనాల్లో 70% దాటగా.. పింఛన్ల రూపంలో చెల్లించాల్సిన మొత్తం అంచనాల్లో 94% చేరడం గమనార్హం.