అనంతపురం జిల్లా రాయదుర్గంలో మున్సిపల్ అత్యవసర సమావేశాన్ని సోమవారం ఛైర్పర్సన్ పోరాళ్ల శిల్ప అధ్యక్షతన నిర్వహించారు. పురపాలిక కొత్త కార్యవర్గం ఏర్పడిన అనంతరం ఇదే తొలి సమావేశం కావడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి మున్సిపల్ ఎక్స్ అఫిషియో మెంబర్‌గా మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
వారికి సంతాపం..
ఈ సందర్భంగా సభ ప్రారంభమైన వెంటనే పుర మాజీ ఛైర్పర్సన్ జయంతి రాధాకృష్ణ, మున్సిపల్ మాజీ కౌన్సిల్ సభ్యులు రహిమాన్, పోరళ్లు సీతారాం మృతికి సంతాప తెలిపారు. అనంతరం కౌన్సిల్ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. పట్టణ ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందేలా కౌన్సిల్ సభ్యులు కృషి చేయాలని విప్ రామచంద్రారెడ్డి సూచించారు.
'మౌలిక వసతులు కల్పించాలి'
పట్టణంలో తాగునీరు, వీధి దీపాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు వంటి కనీస మౌలిక వసతులు కల్పించాలన్నారు. ప్రజలకు ఉత్తమ సేవలు అందించడం ద్వారా కౌన్సిల్‌కు మంచి పేరు తేవాలన్నారు. ప్రజలు వైకాపా సర్కార్‌పై పెట్టుకున్న ఆశలను అధికారులు, కౌన్సిలర్లు సమన్వయంతో పనిచేసి తీర్చాలని పేర్కొన్నారు. ప్రజలకు ఉత్తమ సేవలు అందించడం ద్వారా ప్రభుత్వ పనితీరు మెరుగుపడుతుందని వెల్లడించారు. ప్రజా ప్రతినిధులు పట్టణ అభివృద్ధికి పాటుపడాలన్నారు. అనంతరం స్పందించిన కౌన్సిలర్లు, ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యల గురించి సభలో ప్రస్తావించారు. కార్యక్రమంలో 32 మంది తెదేపా, వైకాపా కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కడప ఉక్కు భాగస్వామికి ఆర్థిక కష్టాలు