YCP leaders attacked an army jawan: దేశాన్ని కాపాడే ఓ ఆర్మీ జవాన్‌పై వైసీపీ నేతలు కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. జవాన్‌పై దుర్భాషలాడుతూ, పొలాల్లో వెంటాడుతూ చేతుల్లో ఉన్న ఆయుధాలతో చితకబాదారు. దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ ఆర్మీ జవాన్.. వైసీపీ నేతల నుంచి తప్పించుకుని ఆసుపత్రిలో చేరాడు. ఈ సంఘటనతో శ్రీ సత్యసాయి జిల్లాలో కలకలం రేగింది.
పోతలయ్య జాతరలో దారుణం: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం తుమ్మల గ్రామంలో మంగళవారం రాత్రి దారుణ ఘటన జరిగింది. తుమ్మల గ్రామానికి చెందిన సమరసింహా రెడ్డి అనే యువకుడు ఆర్మీ జవాన్. అతను ప్రస్తుతం కశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. తల్లిదండ్రుల పిలుపుమేరకు గ్రామంలో (తుమ్మల) జరుగుతున్న పోతలయ్య జాతర కోసం ఊరికి విచ్చేశాడు. ఈ క్రమంలో సమరసింహా రెడ్డి (ఆర్మీ జవాన్) మంగళవారం రోజున కుటుంబ సభ్యులతో కలిసి జాతరలో పాల్గొన్నాడు.
వాహనం తీయమన్నందుకు దాడి: వైసీపీకి చెందిన జడ్పీ వైస్ ఛైర్మన్ కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి దారికి అడ్డంగా తన బండిని పెట్టాడు. దీంతో సమరసింహా రెడ్డి.. వాహనం రోడ్డుకు అడ్డంగా ఉంది కాస్త పక్కకు తీయమని డ్రైవర్‌కు తెలిపాడు. దీంతో డ్రైవర్ ఆగ్రహంతో రగిలిపోయి ఇది సుధాకర్ రెడ్డి వాహనం దీన్నే పక్కకు తీయమంటావా అంటూ సమరసింహా రెడ్డితో గొడవకు దిగాడు. తమ ఇంటి దగ్గర నుంచి వాహనాన్ని పక్కకు తీసి, ఆ తర్వాత ఎక్కడైనా పెట్టుకోమంటూ సమరసింహా రెడ్డి చెప్పాడు. అంతే, జెడ్పీ వైస్ చైర్మన్ కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి అతని అనుచరులు సమరసింహా రెడ్డిపై కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ దాడి నుంచి తప్పించుకున్న జవాన్.. ఆసుపత్రిలో చేరాడు.
వైసీపీ జడ్పీ వైస్ చైర్మన్‌ను అరెస్ట్ చేయాలి: ఈ ఘటన గురించి తెలుసుకున్న ధర్మవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ ఆసుపత్రికి వెళ్లి ఆర్మీ జవాన్ సమరసింహా రెడ్డిని పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..''దేశాన్ని కాపాడే ఆర్మీ జవాన్ సమరసింహా రెడ్డిపై పచ్చి బాలింతను హత్య చేసిన వ్యక్తి, జడ్పీ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి తన అనుచరులతో దాడి చేయించటం దుర్మార్గం. ధర్మవరం నియోజకవర్గం తుమ్మల గ్రామంలో జరుగుతున్న ఊరి జాతరకు నన్ను ఆహ్వానిస్తే.. వైసీపీ నేతలు కక్ష కట్టి ఆర్మీ జవాన్‌పై దాడి చేశారు. రోడ్డుకు అడ్డంగా పెట్టిన వాహనాన్ని తీయమన్నందుకు ఆర్మీ జవాన్ సమరసింహా రెడ్డిని సుధాకర్ రెడ్డి, అతని అనుచరులు తీవ్రంగా కొట్టారు. వంట సామాన్లను ట్రాక్టర్లో ధర్మవరం తీసుకుపోతుంటే, ఒంటరిగా ఉన్న ఆర్మీ జవాన్‌పై అదును చూసి దాడి చేశారు.
14 హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తిని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రాంరెడ్డి పక్కన పెట్టుకున్న తిరగడం సిగ్గుచేటు. రేషన్ బియ్యం, గుట్కా దందాలు చేసే వ్యక్తి జెడ్పీ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి. అలాంటి వ్యక్తిచేత జవాన్‌పై దాడి చేయించారు. ఆర్మీ జవాన్ సమరసింహా రెడ్డి తండ్రి నన్ను జాతరకు ఆహ్వానించాడనే అక్కసుతోనే తన కుమారుడిపై దాడి చేశారు. జెడ్పీ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి పోలీసులు అరెస్ట్ చేయాలి.'' అని ఆయన డిమాండ్ చేశారు.
వైసీపీ దుర్మార్గ పాలనకి పరాకాష్ట: వైసీపీ కక్షలకి అంతు లేకుండా పోతోందని.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం తుమ్మల గ్రామంలో జరుగుతున్న జాతరకు పరిటాల శ్రీరామ్‌ను ఆహ్వానించారనే అక్కసుతో సమరసింహా రెడ్డి అనే ఆర్మీ ఉద్యోగిపై హత్యాయత్నం చేయడం రాష్ట్రంలో వైసీపీ దుర్మార్గ పాలనకి పరాకాష్టని మండిపడ్డారు. ఆర్మీ ఉద్యోగిపై దాడి చేసిన జడ్పీ వైస్ ఛైర్మన్ కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సమరసింహా రెడ్డికి డాక్టర్లు మెరుగైన వైద్యం అందించాలని నారా లోకేశ్ కోరారు.
ఇవీ చదవండి