Minister Usha Sri Charan Vs YCP Leaders: నిన్నమెున్నటి వరకు నెల్లూరు జిల్లా రెబల్ నేతలతో ఉక్కిరిబిక్కిరైన వైసీపీకి నేడు అనంతపురం జిల్లా నుంచి వ్యతిరేకత మెుదలైంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వైసీపీ నుంచి గెలిచిన మంత్రి ఉష శ్రీ చరణ్‌కు వ్యతిరేకంగా కార్యకర్తలు, నేతలు సమావేశమయ్యారు. మంత్రి తీరు నియోజకవర్గంలోని నేతలు కార్యకర్తలు ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆరోపించారు.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో రాష్ట్ర స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్‌కు వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు, నేతల నుంచి వ్యతిరేకత మెుదలైంది. మంత్రికి వ్యతిరేకంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి ఉష శ్రీ చరణ్‌కు వ్యతిరేకంగా తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. కళ్యాణదుర్గంలో వైసీపీ రాష్ట్ర పార్టీ కార్యదర్శి తిప్పేస్వామి ఇంట్లో నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న నేతలు మంత్రి పార్టీ పరంగా తమను తీవ్ర అవమానాలకు గురి చేస్తుందని, పార్టీలో తీవ్రంగా అవమానిస్తున్నారని, ఏ కార్యక్రమానికీ పిలవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉష శ్రీ చరణ్ బయట నుంచి వచ్చిన వ్యక్తి అని.. అందుకే స్థానికంగా ఉన్న నాయకులను నిర్లక్ష్యంగా చూస్తున్నారని ఆరోపించారు. ఇలా చేస్తే తమ రాజకీయం భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన ఉషశ్రీ చరణ్ స్థానిక వైసీపీని నిర్వీర్యం చేస్తుందని పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
'కళ్యాణదుర్గం నియోజకవర్గంలో గత నాలుగు సంవత్సరాల నుంచి సమస్యలు ఉన్నా... సీఎం జగన్‌పై ఉండే అభిమానంతో వైసీపీకి వ్యతిరేకంగా ఎక్కడా మాట్లడలేదు. గత కొంత కాలంగా స్థానికంగా ఉన్న వైసీపీ నేతలు, కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీని అణగతొక్కడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గంలోని వైసీపీ నేతలు, కార్యకర్తలను పట్టించుకోవడం లేదంటూ... కార్యకర్తలు ఆరోపిస్తున్న నేపథ్యంలో నేడు మా ఇంట్లో సమావేశం నిర్వహించాం. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను జగన్ దృష్టికి తీసుకెళ్తాం.' -తిప్పేస్వామి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి
తెలుగు దేశం పార్టీ నుంచి వైసీపీలోకి వలస పక్షిలా వచ్చిన మంత్రి ఉష శ్రీ చరణ్ ఇప్పుడు తమనే పార్టీ నుంచి వెళ్లిపోమంటున్నారని వైసీపీ నేతలు మండిపడ్డారు. ఉష శ్రీ చరణ్ గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారని.. ఇష్టం ఉంటే ఉండండీ లేదంటే తెలుగుదేశం పార్టీలోకి వెళ్లండంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి వ్యతిరేకంగా కాకుండా నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు జగన్‌కు తెలిసేందుకే ఈ మీటింగ్ పెట్టినట్లు అసమతి నేతలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో స్థానిక నేతకే పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానికంగా ఉండే ఎవ్వరికైనా.. ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే పర్వాలేదని, కానీ స్థానికేతరులకు టిక్కెట్ ఇవ్వకూడదని డిమాండ్ చేశారు. మంత్రి మంత్రి ఉష శ్రీ చరణ్ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కూడా నామమాత్రంగా పాల్గొంటూ.. అధిష్టానాన్ని మభ్యపెడుతున్నారని విమర్శించారు.