అనంతపురం జిల్లా గుంతకల్లులోని 100 పడకల ప్రభుత్వాసుపత్రిలో.. పదుల సంఖ్యలో వెంటిలేటర్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి. గతేడాది కరోనా తొలి దశ సమయంలో 7కోట్ల రూపాయల వ్యయంతో 70 వెంటిలేటర్లను ఇక్కడి ఆసుపత్రి కోసం కొనుగోలు చేశారు. వీటి నిర్వహణకు తగినంత సిబ్బంది లేరన్న కారణంతో స్టోర్ రూంలోనే ఉంచేశారు. తీవ్ర లక్షణాలతో వచ్చిన రోగులను..వెంటిలేటర్లు లేవంటూ అనంతపురం, కర్నూలుకు వెళ్లాలని సూచిస్తున్నారు. కొంతమంది దారిలోనే ప్రాణాలు వదులుతున్నారు.
కొత్తగా వెంటిలేటర్లు అమరిస్తే..ఉన్న ఆక్సిజన్ సరఫరా సరిపోదని.. దాన్ని పెంచాలని కలెక్టర్‌కు ప్రతిపాదన పంపినట్టు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. వెంటిలేటర్లు నిరుపయోగంగా పడి ఉన్నా ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రజాసంఘాల నాయకులు నిలదీస్తున్నారు. వెంటిలేటర్లను వినియోగంలోకి తెచ్చి ఉంటే ఎందరో ప్రాణాలు దక్కేవని ప్రజాసంఘాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇదీ చదవండి: మళ్లీ.. 'అనంత'లో మృత్యుఘోష.. ఆక్సిజన్ అందక నలుగురు మృతి!