నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తున్న 27 టిప్పర్లను ఉరవకొండ 'సెబ్-పోలీసులు' సీజ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాయదుర్గం ఇసుక రీచ్ నుంచి సోమవారం రాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్లను పాల్తూరు తనిఖీ కేంద్రం వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఇసుక రీచ్‌లలో కొన్న ధర కంటే రెట్టింపు ధరకు ఇసుకని విక్రయిస్తున్నట్లు బయట పడిందని తెలిపారు.
ఇసుక అమ్మకాల్లో జరుగుతున్న అక్రమాలపై పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టామని ఉరవకొండ సీఐ శేఖర్, సెబ్ సీఐ మారుతిరావులు వెల్లడించారు. ఉరవకొండ సర్కిల్ పరిధిలో స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో (సెబ్) ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. ఇసుకను బుక్ చేసుకున్న వారికి పంపిణీ చేయకుండా టిప్పర్ యజమానులు అధిక ధరలకు ఇతరులకు అమ్ముకుంటున్నట్లు తేలిందన్నారు. మరోసారి ఇలాగే జరిగితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పట్టుబడిన 27 వాహనాలను సీజ్ చేసి ఒక్కో వాహనానికి 36 వేలు చొప్పున జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: Supreme Court: ఒక్క విద్యార్థి ప్రాణం పోయినా రాష్ట్రానిదే బాధ్యత: సుప్రీంకోర్టు