అనంతపురం జిల్లా తనకల్లు మండలం నల్లగుట్లపల్లిలో విషాదం జరిగింది. అక్కాతమ్ముడు నీటికుంటలో పడి మృతిచెందారు. గ్రామానికి చెందిన రామచంద్ర, గాయత్రి దంపతులకు ముగ్గురు సంతానం. భార్యాభర్తలు, పెద్ద కుమార్తె పొలం వెళ్లగా.. రెండో కుమార్తె వేదిత, కుమారుడు సాయితేజ ఇంటి దగ్గర ఉన్నారు. గ్రామంలోని మరో బాలుడితో కలిసి వారిద్దరూ నీటికుంట వద్దకు ఆడుకునేందుకు వెళ్లారు.
ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ సాయితేజ నీళ్లల్లో పడిపోయాడు. తమ్ముడ్ని కాపాడేందుకు ప్రయత్నించిన వేదిత కూడా నీటిలో పడిపోయింది. ఇది గమనించిన బాలుడు గ్రామస్థులకు విషయం చెప్పగా.. వారు వచ్చి ఇరువురినీ బయటకు తీశారు. ఆసుపత్రికి తరలిస్తుండగా వేదిత మృతిచెందగా.. చికిత్స పొందుతూ సాయితేజ మరణించాడు. ఆడుతూ పాడుతూ తిరిగే తమ బిడ్డలు ఇక లేరని తెలుసుకున్న ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇవీ చదవండి...