తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలు, నకిలీ బంగారు ఆభరణాలతో జనాలను మోసం చేస్తున్న మరో ముగ్గురిని అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. నగరానికి చెందిన షికారి అర్జున్, షికారి కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు తాగుడు, జూదానికి అలవాటు పడి.. డబ్బు కోసం దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. వీరు 2018 నుంచి జిల్లా కేంద్రంతో పాటు రూరల్ ప్రాంతాల్లో 14 దొంగతనాలు చేశారు. ముఖ్యంగా తాళం వేసిన ఇళ్లను ఎంచుకుని పగలు, రాత్రి తేడా లేకుండా దోచేస్తున్నారు. గతంలోనే అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినా... వారి వైఖరిలో మార్చు రాలేదు. వీరిద్దరినీ పోలీసులు పట్టుకుని... రూ.18 లక్షల విలువ చేసే 458 గ్రాముల బంగారం, 59 గ్రాముల వెండి, ఒక ద్విచక్రవాహనం, చేతి గడియారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు కర్ణాటకకు చెందిన మణి, వీరు, మోహన్ అనే ముగ్గురు వ్యక్తులు... ప్లాస్టిక్ పూల హారాలు విక్రయిస్తూ జీవించేవారు. వ్యాపారం ద్వారా వచ్చే డబ్బు సరిపోక మోసాలు చేయడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా మణి... మంజునాథరెడ్డి అనే వ్యక్తిని పరిచయం చేసుకుని తన వద్ద పురాతన ఆభరణాలు ఉన్నాయని వాటిని తక్కువ ధరకే విక్రయిస్తానని నమ్మబలికాడు. అతన్ని నమ్మించేందుకు కొంత అసలు బంగారు ఇచ్చాడు. దీనిని నమ్మిన మంజునాథరెడ్డి 8 లక్షలకు హారాన్ని కొనుగోలు చేశాడు. ఆ తరువాత అది నకిలీదని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మణితో పాటు ఇలాంటి మోసాలకే పాల్పడుతున్న వీరు, మోహన్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 3 లక్షల నగదు, రెండు నకిలీ బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు తెలిపారు. రెండు కేసులను పరిష్కరించిన బృందాలను ఆయన అభినందించారు.
ఇదీ చదవండి :