ఇటీవల కురిసిన వర్షాలకు అనంతపురం జిల్లాలో సాగైన వేరుశెనగ, మొక్కజొన్న, మిరప, వరి, పత్తి తదితర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. లక్షల ఎకరాల్లో రూ.వందల కోట్ల నష్టం వాటిల్లింది. సింహభాగం వేరుశెనగకు తీవ్ర నష్టం కలిగింది. ఖరీఫ్ సీజన్‌లో సాగైన పంటలను ఓ వైపు చీడపీడలు, మరోవైపు వర్షాలు చుట్టుముట్టి రైతు కష్టాన్ని మట్టిపాలు చేశాయి. అప్పుల్ని మిగిల్చాయి.
భరోసా ఏదీ?
ఖరీఫ్‌లో సాగైన అన్ని పంటలు దెబ్బతిన్నాయి. రూ.వందల కోట్ల నష్టం జరిగింది. అయితే వ్యవసాయశాఖ అంచనాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఇప్పటికీ చాలా గ్రామాల్లో నీట మునిగిన పంటలను పరిశీలించలేదు. నష్టపోయిన రైతులకు భరోసా కల్పించే చర్యలు తీసుకోలేదు. తమ కష్టాలను పట్టించుకునేవారే లేరని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వాన ముంచింది..
పాత అప్పులు తీర్చుదామని, ఈసారి 9 ఎకరాల భూమి కౌలుకు తీసుకుని మిరప సాగు చేశా. ఎకరాకు 20 వేల చొప్పున యజమానికి కౌలు చెల్లించా. పెట్టుబడి కోసం ఎకరాకు రూ.18 వేలు ఖర్చు చేశా. భారీ వర్షాలతో పంటలో నీరు నిలిచింది. విల్ట్ తెగులు ఆశించి మిరప పంట పూర్తిగా ఎండిపోయింది. కొంత భాగం తొలగించి, జొన్న సాగు చేస్తున్నా. మళ్లీ వచ్చిన వానలతో జొన్న పంట కూడా కొంత దెబ్బతింది. చివరికి అప్పులే మిగిలాయి. - సుంకిరెడ్డి, పాల్తూరు, విడపనకల్లు
పశుగ్రాసానికీ పనికిరాదు
పదెకరాల్లో వేరుశెనగ సాగు చేశా. జూన్‌లో పంట వేశా. అంతా బాగుందనుకున్న సమయంలో వానలు వదలడం లేదు. పంట కోసం రూ.2.20 లక్షలు పెట్టుబడి పెట్టాం. పంట తొలగించి, పొలంలో కుప్పలుగా వేసిన తర్వాత పదిరోజులు తెరిపిలేకుండా కురిసిన వర్షాలతో మొత్తం కుళ్లిపోయింది. కాయలకు మొలకలు వచ్చాయి. వేరుశెనగ కట్టె కూడా పశుగ్రాసానికీ పనికిరాకుండా పోయింది. ప్రభుత్వం ఆదుకుంటేనే అప్పు నుంచి బయటపడతాం. - నాగేంద్రమ్మ, రాప్తాడు
దిగుబడి తగ్గింది
అధిక వర్షాలతో ఖరీఫ్ పంటలు దెబ్బతిన్నాయి. అన్నిటికంటే వేరుశెనగకే ఎక్కువగా నష్టం వాటిల్లింది. ఎకరాకు 6-7 బస్తాలు దిగుబడి రావాల్సి ఉండగా.. అధిక వర్షాలతో 2-3 బస్తాలు మించి దిగుబడి రాలేదు. పంట కోత ప్రయోగాలు వేగంగా నిర్వహిస్తున్నాం. వీటి ఫలితాల ఆధారంగా దిగుబడి అంచనావేసి ప్రభుత్వానికి నివేదిస్తాం. - రామకృష్ణ, జేడీఏ
ఇదీ చదవండి: వరదెత్తిన కృష్ణమ్మ.. 2009 తర్వాత శ్రీశైలానికి మళ్లీ భారీ వరద