అప్పుల బాధ తట్టుకోలేక పురుగుల మందు తాగి కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలో జరిగింది. 10 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకున్ని పత్తి, మిరప సాగు చేయగా... వాతావరణం అనుకూలించక నష్టం వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు ఎవరూ లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ కలహాలతో వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం ఉప్పలవారిపాలెంలో జరిగింది. అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం జోగన్నపేట వద్ద ద్విచక్రవాహనం అదుపు తప్పి ఒకరు మృతి చెందగా... మరొకరికి గాయాలయ్యాయి.
ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం వీఆర్.గూడెంలో జరిగింది. అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదంలో పక్కింటి వారి ప్రమేయం ఉందన్న అనుమానంతో నిందితుడు ఈ ఘటనకు పాల్పడ్డాడు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం లాలాచెరువు సమీపంలో మృతదేహం లభ్యమైంది. మృతుడు రాజమహేంద్రవరంలోని రాజేంద్రనగర్‌కు చెందిన అద్దూరి అప్పన్న గుర్తించారు. పామాయిల్ గెలలు నరకడానికి వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై కూలీ మృతిచెందిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురంలో జరిగింది. ఇనుప గెడతో గెలలను కోస్తుండగా ఈ దుర్ఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి రైల్వేస్టేషన్ సమీపంలోని రైలు పట్టాలపై అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందింది. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని శ్రీకాళహస్తి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. గుర్తుతెలియని మహిళ, పురుషుడు పొలాల్లో శవమై కనిపించిన ఘటన కర్నూలు జిల్లా బనగానపల్లెలో జరిగింది. పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరిన బాధితులను.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇరువురూ మరణించారు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం కోట క్రాస్ రోడ్డు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై బైక్ అదుపుతప్పి బోల్తా పడడడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు.
ఇదీచదవండి