Yuvagalam Padayatra: ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. రాప్తాడు నియోజకవర్గంలోకి ప్రవేశించిన పాదయాత్రకు ఎస్కే యూనివర్సిటీ వద్ద స్థానికులు, యువత, విద్యార్థులు పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు, నిరుద్యోగ యువత నారా లోకేశ్‌కు పూలజల్లులతో బ్రహ్మరథం పట్టారు. యువగళంలో భారీ సంఖ్యలో పాల్గొన్న ప్రజలకు, అభిమానులకు అభివాదం చేసుకుంటూ లోకేశ్ ముందుకు సాగారు.
లోకేశ్‌కు ఎస్కే యూనివర్సిటీ విద్యార్థులు తమ కష్టాలను చెప్పుకున్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పినందుకు ఓటు వేసి, మోసపోయామని ఎస్కేయూ సీనియర్ విద్యార్థులు, నిరుద్యోగ యువత లోకేశ్‌కు చెప్పారు. ఎస్కేయూ దాటగానే అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు పెద్దఎత్తున రహదారిపైకి వచ్చి పాదయాత్రగా వచ్చిన లోకేశ్‌కు ఘన స్వాగతం పలికారు. విద్యార్థులు పోటీపడి లోకేశ్‌తో సెల్ఫీలు దిగారు. అనంతరం పాదయాత్రలో లోకేశ్‌తో కలిసి కొంతదూరం నడిచారు.
పాదయాత్రలో 59వ రోజైన ఈ రోజు లోకేశ్ 14.3 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకూ యువగళం మొత్తం 760.1 కి.మీ. సాగింది. పాదయాత్ర 60వ రోజైన రేపు రాప్తాడు పంచాయితీ ఆకుతోట పల్లి విడిది కేంద్రం నుంచి ఉదయం 8.30కి పాదయాత్ర ప్రారంభం కానుంది. అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించనుంది. అనంతపురం టీవీ టవర్ వద్ద ఆర్డీటి సెంటర్‌ను లోకేశ్ సందర్శించనున్నారు.
విజయనగర్ కాలనీలో భోజన విరామం అనంతరం అక్కడే నిర్వహించనున్న బహిరంగ సభలో లోకేశ్ ప్రసంగించనున్నారు. జ్యోతిరావ్ పూలే సర్కిల్లో వాల్మీకి, రజకులతో భేటీ కానున్నారు. అంబేద్కర్ నగర్ సర్కిల్లో ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశం కానున్న లోకేశ్.. పవర్ హౌస్ సర్కిల్లో ముస్లింలతో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు.
అనంతరం బసవన్న గుడి వద్ద ఆర్యవైశ్య సామాజిక వర్గీయులతో అదే విధంగా విజయ క్లాత్ సెంటర్లో కురుబ సామాజిక వర్గీయులతో భేటీ కానున్నారు. సూర్యనగర్‌లో మేదర సామాజికవర్గీయులతో మాటామంతీ చేపట్టనున్నారు. సప్తగిరి సర్కిల్లో నాయీబహ్మాణులతో భేటీ అనంతరం, చర్చి సర్కిల్లో క్రిస్టియన్ సామాజిక వర్గీయులతో సమావేశం కానున్నారు.
తరువాత అంబేద్కర్ విగ్రహం వద్ద, శివరామకృష్ణ సర్కిల్లో స్థానికులతో మాటామంతీ చేయనున్నారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కూడలిలో, రుద్రంపేట బైపాస్‌లో స్థానికులతో భేటీ కానున్నారు. నూర్ బాషా ఫంక్షన్ హాల్ వద్ద దూదేకులతో ఆత్మీయ సమావేశం కానున్న లోకేశ్.. కళ్యాణదుర్గం సర్కిల్లో ఎస్టీ సామాజికవర్గీయులతో సమావేశమవనున్నారు. నారాయణపురం అన్న క్యాంటీన్ వద్ద వడ్డెర సామాజికవర్గీయులతో భేటీ కానున్నారు. నారాయణపురం ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ వద్ద బలిజ సామాజికవర్గీయులతో భేటీ నిర్వహించనున్నారు. రాత్రికి ఎంవైఆర్ కల్యాణ మండపం వద్ద రాత్రి బస చేయనున్నారు.
ఇవీ చదవండి: