JCPR fire on Tadipatri YCP MLA: అనంతపురం జిల్లా తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై టీడీపీ మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతనైతే తనపై కేసు పెట్టించు.. కేతిరెడ్డి పెద్దారెడ్డి అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి తొడకొట్టి సవాల్ విసిరారు. తుక్కు వాహనాలకు బీమా చేయకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటున్న.. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేతనైతే తనపై కేసు పెట్టించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.
బీఎస్-3 వాహనాలకు సంబంధించిన కేసుపై నేడు జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి.. కొనుగోలు చేసిన వాహనాలు, పోలీసులు పెట్టిన కేసుల ఎఫ్‌ఐఆర్‌లు, ఆర్టీఏ అధికారులు కోర్టుకు సమర్పించిన పత్రాలన్నింటినీ ఒక ప్లెక్సీపై ముద్రించి.. మీడియా ఎదుట ప్రదర్శించారు. వాహనాలకు బీమా చేయకుండా రిజిస్ట్రేషన్ చేయించానని, కేసు పెటిస్తామని చదువురాని తాడిపత్రి ఎమ్మెల్యే చెబుతున్నారని జేసీ మండిపడ్డారు.
అనంతరం ఎమ్మెల్యే చెప్పినట్లుగా వాహన బీమా లేదని, నకిలీ బీమా పత్రం ఇచ్చానని తనపై ఏ అధికారి అయినా కేసు పెట్టాలని సవాల్ చేశారు. అధికారులంతా చట్టాలు బాగా తెలిసినవారని చెప్పుకొచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. చేతనైతే ఎమ్మెల్యే తనపై కేసు పెట్టించాలని అన్నారు. బీఎస్-3 వాహనాల అనుమతిని సుప్రీంకోర్టు పొడిగిస్తుందని భావించిన అశోక్ లైలాండ్ కంపెనీ దేశవ్యాప్తంగా 68 వేల వాహనాలు విక్రయించిందన్నారు.
సుప్రీంకోర్టు తీర్పు వచ్చేసరికే అన్ని వాహనాలకు రిజిస్ట్రేషన్ పూర్తైందన్నారు. అయితే, దేశంలో తనపైనే మాత్రమే ఇలాంటి కేసులు పెట్టారని, దీనికి కోర్టులో అన్ని ఆధారాలతో సమాధానం చెబుతానని జేసీ తెలిపారు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి తలచెడిందని వైద్యం చేయించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు.
ఇవీ చదవండి