TDP MLA Questioned YCP Government: ప్రత్యామ్నాయ కాలువలో కంపలను మీరు తొలగిస్తారా లేక సొంత ఖర్చులతో కాలువ పనులను చేపట్టడానికి మమ్మల్ని సమాయత్తం అవ్వమంటారా అని ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పంటలను కాపాడి రైతులను గట్టెక్కించాలన్నదే మా అభిప్రాయం, ఆ దిశగా మా ప్రయత్నాన్ని ముమ్మరం చేస్తామని కేశవ్ స్పష్టం చేశారు.
Water Flow in GBC has Stopped Lack of Rain: అనంతపురం జిల్లాలో ఉరవకొండ మండలం నింబగల్లు వర్షాభావ పరిస్థితులతో హెచ్‌ఎల్‌సీకి తుంగభద్ర జలాల సరఫరా ఆగిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానికి అనుబంధంగా సాగే గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ (GBC)లో నీటి ప్రవాహం నిలిచిపోయింది. ఈ కాలువ కింద 32 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాాగవుతున్నాయని రైతులు చెబుతున్నారు. దీనిలో సింహభాగంగా మిరప పంటని పండిస్తున్నామని,ఈ పంట ప్రస్తుతం పిందె దశలో ఉండటంతో నీటి తడులు అవసరం ఉందంటున్నారు. వర్షాలు లేకపోయినా తుంగభద్ర నీటితో ఇన్నాళ్లూ రైతులు పంటను కాపాడుకుంటున్నారు. నెల రోజులు పంటకు నీరు అందిస్తే వేల ఎకరాల్లో సాగవుతున్న మిరపతో పాటు ఇతర పంటలు చేతికి అందే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు.
జీబీసీకి ప్రత్యామ్నాయంగా కృష్ణా జలాలను తరలించడానికి వీలుంది. హంద్రీనీవా ఉపకాలువ ద్వారా నింబగల్లు వద్ద జలాలను జీబీసీలో కలపడానికి మార్గం ఉందని, 7కి.మీ కాలువ, 7 కి.మీ వంక ద్వారా కృష్ణా జలాలు కలుస్తాయని రైతులు చెబుతున్నారు. ఈ ప్రత్యామ్నాయ కాలువలో ప్రస్తుతం ముళ్లకంపలు పెరిగాయి. వాటిని తొలగిస్తే నీరు సులభంగా అక్కడికి చేరుతుంది. ప్రస్తుతం హంద్రీనీవాలో ప్రవాహం ఆశాజనకంగా సాగడంతో దీని ద్వారా సాగుకు నీరందించాలని రైతులు కోరుతున్నారు. ఈ పంట కోసం చాలా డబ్బులు ఖర్చు చేసామని, గత టీడీపీ ప్రభుత్వంలో పయ్యావుల కేశవ్ కృష్టితో నదీ జలాలు అందాయని రైతులు తెలిపారు. జగన్ సర్కారు పట్టించుకోకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎండిపోతున్న పంటలు కాపాడుకునేందుకు పల్నాడు రైతన్నల ప్రయత్నాలు - ప్రభుత్వ అలసత్వంవల్లేనని ఆవేదన
తుంగభద్ర జలాలు ఆగిపోతాయని అధికారులు రెండు నెలలుగా ప్రకటిస్తూనే ఉన్నా వైసీపీ ప్రభుత్వం ఎందుకు ప్రత్యామ్నాయ చర్యలను చేపట్టలేదని కేశవ్ ప్రశ్నించారు. అదే పార్టీకి చెందిన మంత్రి తన ప్రాంతానికి కృష్ణా జలాలను తరలిస్తుంటే, ఇక్కడి నాయకులు మాత్రం ఆ దిశగా ప్రయత్నించకపోవడం విడ్డూరంగా ఉంది అని పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దానిని కాపాడే దిశగా అధికార పార్టీ ముఖ్య నాయకులు చొరవ చూపుతున్న దాఖలాలు లేవని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా వైసీపీ సర్కారు ప్రత్యామ్నాయ చర్యలు ప్రారంభించకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
"జీబీసీకి కృష్ణా జలాలను అందించి పంటలను కాపాడాలన్నది మా కోరిక. దానికి అనుగుణంగా నా సొంత ఖర్చులతో ప్రత్యామ్నాయ కాలువలో కంపలను తొలగించి, దానిని ఆధునీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రభుత్వం సమస్యను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోకపోతే మేము సమాయత్తం అవుతాము. పంటలను కాపాడి రైతులను గట్టెక్కించాలన్నదే మా అభిప్రాయం. -పయ్యావుల కేశవ్, ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే