అనంతపురం జిల్లాలో కొందరు పోలీసులు వైకాపా ఆదేశాల ప్రకారం పని చేస్తున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. రాయదుర్గంలో వైకాపా నాయకులు డబ్బులు పంచడాన్ని తెదేపా కార్యకర్తలు ఫొటో తీసి పోలీసులకు పంపితే డబ్బు పంచినవారిని వదిలేసి.. ఫొటో తీసినవారిని స్టేషన్‌లో కూర్చోబెట్టారని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. ఎన్నికల బరిలో ఉన్న ఓ వైద్యుడి ఆస్పత్రిలో తనిఖీల పేరుతో వచ్చిన పోలీసులను ఎవరు ఫిర్యాదు చేశారు? ఏమని ఫిర్యాదు చేశారని అడిగితే సమాధానం లేదన్నారు. 48 గంటలపాటు రాయదుర్గం వదిలి వెళ్లాలని అధికారులు, పోలీసులు తనకు నోటీసులిచ్చినట్టు కాలవ తెలిపారు.
రాత్రిమొత్తం స్టేషన్‌లో కూర్చోబెట్టారు..
అనంతపురంలోనూ తమ కార్పొరేటర్ అభ్యర్థులను సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు స్టేషన్‌లో కూర్చోబెట్టారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. ప్రచారంలో పాల్గొన్న కొందరు కార్యకర్తలు భయంతో ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారని తెలిపారు. తాడిపత్రిలోనూ పరిస్థితి దారుణంగా ఉందని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ధర్మవరం, హిందూపురం పురపాలికల్లోనూ అనేక విధాలుగా బెదిరింపులు వస్తున్నాయని అభ్యర్థులు, నేతలు ఆరోపిస్తున్నారు.
ఇదీ చూడండి: