రాయదుర్గంలో వెంకటేశ్వరస్వామి కళ్యాణ ముహూర్తం విషయమై అధికార, ప్రతిపక్ష నేతల ఆరోపణలు ప్రత్యారోపణలతో ఉద్రిక్తంగా మారింది. పట్టణంలో జరిగిన వెంకటేశ్వరస్వామి కళ్యాణ వేడుకకు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని ఆహ్వానించారు. అయితే ఆయన రాక ఆలస్యమైనందుకు స్వామి కళ్యాణ ముహూర్తం మార్చి అపచారం చేశారని కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. దీన్ని రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తోసిపుట్టారు. కల్యాణోత్సవంలో అపచారం జరగ లేదని..సమయానికె కళ్యాణం జరిపించామని జవాబిచ్చారు.
అయితే అపచారం జరిగినట్లుగా ఆలయానికి వచ్చి నిరూపిస్తానని కాలవ శ్రీనివాసులు సవాల్ విసిరారు. ఈ క్రమంలోనే ఆయన అనంతపురం నుంచి రాయదుర్గం వెళ్తుండగా ఆత్మకూరు మండలం, ఒడ్డుపల్లి టోల్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. స్టేషన్ కు రావాలని పోలీసులు చెప్పడంతో నోటీసు ఇవ్వకుండా తనను స్టేషన్‌కు ఎలా పిలుస్తారని కాలవ ప్రశ్నించారు. పోలీసుల తీరుకు నిరసనగా తేదేపా కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.
రెచ్చిపోతే మీ పరిస్థితి అంతే ఇక- కాపు రామచంద్రారెడ్డి: రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం ఘోరంగా ఓడిపోతుందని రాయదుర్గం వైకాపా ఎమ్మెల్యే, జిల్లా వైకాపా అధ్యక్షుడు కాపు రామచంద్రా రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కుట్ర పూరిత ఆలోచనలతో కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు మాటలు విని ప్రజలు, కార్యకర్తలు రెచ్చిపోతే కఠిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కార్యకర్తలు తమ భవిష్యత్తు ఏంటో ఆలోచించుకోవాలన్నారు. అనంతపురంలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. ఈ మేరకు తేదేపా కార్యకర్తలను హెచ్చరించారు. ఈనెల 29న సామాజిక న్యాయ భేరీ బస్సుయాత్ర అనంతపురం జిల్లాకు వస్తోందని.. బీసీ మంత్రులు చేపట్టిన యాత్రకు ప్రజలు మద్దతు ఇచ్చి జయప్రదం చేయాలని సమావేశంలో కోరారు. ఈ సందర్భంగా సామాజిక న్యాయ భేరి యాత్ర పోస్టర్లను విడుదల చేశారు.
ఇదీ చదవండి: కాకినాడ జీజీహెచ్ వద్ద ఉద్రిక్తత.. మార్చురీ గదికి చొచ్చుకెళ్లేందుకు తెదేపా యత్నం