తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో గురువారం ఆయన అధ్యక్షతన నియోజకవర్గ తెదేపా నేతల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. రోజురోజుకీ వైకాపా నాయకుల ప్రవర్తన... ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని కాలవ అసంతృప్తి వ్యక్తం చేశారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల సభలో సీఎం జగన్ వ్యవహరిస్తున్న తీరు అప్రజాస్వామ్యంగా ఉందన్నారు. తన తండ్రి వయసు కలిగిన చంద్రబాబు పట్ల ఎలాంటి గౌరవమర్యాదలు లేకుండా మంత్రులతో చేయిస్తున్న వ్యాఖ్యలు, వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు.
'కొత్తగా అధికారం చేపట్టిన వైకాపా ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కృషి చేయాలి. సీఎం జగన్ ప్రజల మంచి కోసం చేపట్టే ఏ కార్యక్రమానికైనా తెదేపా సహకరిస్తుంది. ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే మాత్రం ఊరుకోం.' - కాలవ శ్రీనివాసులు, మాజీ మంత్రి
వైకాపా నాయకులు తెదేపా నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేది లేదని కాలవ చెప్పారు. కార్యకర్తలను కాపాడుకోడానికి శాయశక్తులా కృషి చేస్తానన్నారు. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటిని పరిష్కరించేందుకు తెదేపా నేతలు కృషిచేయాలన్నారు. త్వరలో వచ్చే గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి నేతలందరు కలిసి కట్టుగా పనిచేయాలన్నారు.
ఇదీ చదవండి : రాష్ట్రంలో పోలీసు పాలన సాగుతోంది: కన్నా