తీవ్ర కరవు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో ప్రజల గొంతు తడుపుతున్న సత్యసాయి తాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ బిల్లులు చెల్లించని కారణంగా... ఆ బాధ్యతల నుంచి ఎల్అండ్ టి సంస్థ వైదొలిగే పరిస్థితుల్లో ఉందని మాజీఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఆరోపించారు. జిల్లాలో అనంతపురం పట్టణం, చాలా ప్రాంతాలకు సత్యసాయి బాబా తాగునీరు అందించేందుకు వందల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రాజెక్టులు నిర్మించారని వివరించారు.
'ఆ ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం తీసుకోవాలని ఆనాడే ఒప్పందం జరిగింది. ఈ నిర్వహణ బాధ్యతలు ఎల్ అండ్ టీ సంస్థకు అప్పగించారు. అప్పటి నుంచి ఆ సంస్థ బాగా పని చేస్తోంది కానీ... వైకాపా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిర్వహణకు సంబంధించిన బిల్లులు సంస్థకు చెల్లించడం లేదు. దీనివల్ల ఇప్పటి వరకు 18 కోట్ల 10 లక్షల రూపాయల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వైకాపా ప్రభుత్వం చర్యలతో జిల్లాలో విపత్తు రాబోతుంది. మార్చిలోపు ఈ బిల్లులు చెల్లించకపోతే ఆ సంస్థ బాధ్యతల నుంచి తప్పుకుంటామని ప్రభుత్వానికి లేఖ రాసింది. సర్కార్ దీనిపై స్పందించకపోతే మార్చి నుంచి తీవ్ర తాగునీటి ఎద్దడి తప్పదు' -మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి.