Traffic ASI helping nature: ఒకపక్క విధులను కొనసాగిస్తూ.. మరోపక్క పార పట్టి గుంతల్లోకి మట్టి వేస్తూ అందరితో శభాష్ అనిపించుకున్నాడు ఓ పోలీస్ అధికారి. వాహనదారులు ఇబ్బందులు పడకూడదనే ఆలోచన, సామాజిక స్పృహతో మట్టితో గుంతలను పూడ్చాడు.. అనంతపురం నగరం ట్రాఫిక్ ఏఎస్ఐ రామాంజనేయులు. అటుగా వెళుతున్న ఓ వ్యక్తి ఏఎస్ఐ రామాంజనేయులు చేస్తున్న పనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
అనంతపురం నగరంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో రామాంజనేయులు ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నాడు. శివారు కళ్యాణదుర్గం బైపాస్ నుంచి రుద్రంపేటకు వెళ్లే సర్వీస్ రోడ్డు రవి పెట్రోల్ బంక్ సమీపాన చాలా ఇరుకుగా ఉంటుంది. దీనికితోడు క్లాక్ టవర్ నుంచి కళ్యాణదుర్గం వెళ్లే హైవే నిర్మాణం జరుగుతుండడంతో అటుగా వచ్చే వాహనాలన్నీ రుద్రంపేటకు వెళుతుంటాయి. దీంతో నిత్యం వాహనాల రద్దీతో గంటల తరబడి వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఉండడంతో పోలీసులకు పెద్డ సవాల్‌గా మారింది.
వాహనాల రద్దీకి తోడు అక్కడ ఏర్పడిన గుంతలు వాహనదారులకు పెద్ద ఇబ్బందిగా మారాయి. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్ఐ రామాంజనేయులు ఇది గమనించి వృథా మట్టిని కంకరను కలిపి గుంతలను చదును చేశాడు. అటుగా వెళుతున్న ఓ వ్యక్తి ఏఎస్ఐ రామాంజనేయులు చేస్తున్న పనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.