అనంతపురం జిల్లా వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు అట్టహసంగా జరిగాయి. జిల్లాకు చెందిన పలువురు నేతలు తమ పార్టీ కార్యలయాల్లో జాతీయ జెండాకు వందనం సమర్పించారు.
ప్రభుత్వాన్ని ప్రజలు మరొక్కసారి ఆదరించాలని మంత్రి శంకర్ నారాయణ అన్నారు. అనంతపురంలోని వైకాపా కార్యాలయంలో మంత్రి శంకర్ నారాయణ, ఎమ్మెల్యే, ఎంపీతో కలిసి 72వ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. మహాత్మా గాంధీ చూపిన అడుగుజాడల్లో, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో రాష్ట్రంలో సీఎం జగన్ పరిపాలన సాగిస్తున్నారని చెప్పారు.
రాయదుర్గం పట్టణంలోని మున్సిపల్,తాహసీల్దార్ కార్యాలయాల్లో జరిగిన 72వ గణతంత్ర దినోత్సవాల్లో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. రాయదుర్గం మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా, తాహసీల్దార్ సుబ్రహ్మణ్యం.... జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
రాజ్యాంగ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని మాజీ మంత్రి, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. రాయదుర్గంలోని తెదేపా కార్యాలయం వద్ద 72 వ గణతంత్ర వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. రాజ్యాంగ ధర్మాలను కాపాడాలని, అంబేడ్కర్ చూపిన నిజమైన ప్రజాస్వామ్యం పరిణవిల్లాలని ఆకాంక్షించారు.
జిల్లాను అన్నివిధాలా అభివృద్ధి చేస్తూ, సంక్షేమ పథకాల అమలులో ముందుండేలా చేశామని అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు చెప్పారు. అనంతపురం పోలీస్ పెరేడ్ మైదానంలో 72వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంత నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దినట్లు కలెక్టర్ చెప్పారు. ఈసారి ప్రసంగ పాఠం సుదీర్ఘంగా ఉన్న కారణంగా.. కలెక్టర్ దాదాపు గంటకు పైగా ప్రసంగించారు. ఎండ తీవ్రత కారణంగా విద్యార్థులు, పోలీసులు కొందరు సృహ కోల్పోయారు.
మడకశిరలో 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే తిప్పేస్వామి మున్సిపల్ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. పట్టణంలోని మదరసా ఏ అరబియా దారుల్ ఖురాన్ మదరసాలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు, మదరస కమిటీ సభ్యులు జాతీయ జెండా ఎగురవేసి వందన సమర్పణ చేసి దేశభక్తిని చాటుకొన్నారు.
లౌకిక భారతదేశాన్ని స్వతంత్ర, ప్రజాతంత్రగా నిర్మించింది కాంగ్రెస్ పార్టీనే అని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. గణతంత్ర సందర్భంగా ఆ పార్టీ కార్యాలయం వద్ద ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని మండిపడ్డారు.
1500 అడుగుల జాతీయ జెండా
అనంతపురం జిల్లా రొద్దం మండల కేంద్రంలో 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకను పురస్కరించుకొని దొంతి లక్ష్మీ నారాయణ గుప్త ఆధ్వర్యంలో 1500 అడుగుల జాతీయ జెండా ప్రదర్శించారు. రొద్దం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి మండల కేంద్రంలోని ప్రధాన వీధులలో జాతీయ జెండాతో ఈ ప్రదర్శన నిర్వహించారు. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పలు పాఠశాలల విద్యార్థులు యువకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: