Ex MLA Son వైకాపా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరెడ్డి కుమారుడు ప్రణయ్‌రెడ్డి తన అనుచరులతో దాడులు చేయిస్తున్నారని రెన్యూ పవర్ అనే సంస్థ భద్రతా అధికారులు.. జిల్లా ఎస్పీ ఫక్కీరప్పకు ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో రెన్యూ పవర్ పవన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఉరవకొండతో పాటు కర్నూలు జిల్లాలో పలు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కోసం అద్దె వాహనాలను తీసుకున్నారు.
వైకాపా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కుమారుడు ప్రణయ్‌రెడ్డి అనుచరులు ఈ రెన్యూ సంస్థలో అద్దె వాహనాలు పెట్టారు. ఈ వాహనాలు ప్రమాణాల నిబంధనలకు విరుద్దంగా ఉన్నాయని రెన్యూ సంస్థ ప్రతినిధులు చెప్పినా పట్టించుకోకపోగా.. బెదిరింపులు, దాడులకు తెగబడినట్లు శ్రీనివాసులు ఆరోపించారు. వాహనాల మార్పుకోసం గడువిచ్చినా స్పందించకపోవటంతో వైకాపా నాయకుల అద్దె వాహనాలను తొలగించామని చెప్పారు.
దీంతో ప్రణయ్ అనుచరులు, వైకాపా శ్రేణులు ఉరవకొండ మండలం నింబగల్లులోని రెన్యూ పవర్ విద్యుత్ ప్లాంటు వద్దకు వెళ్లి సిబ్బందిని వెలుపలికి పంపి కంటైనర్ గదులకు తాళాలు వేశారని తెలిపారు. పరికరాలను ధ్వంసం చేశారని శ్రీనివాసులు తన ఫిర్యాదులో చెప్పారు. ఉత్పత్తి జరుగుతుండగా విండ్ టర్బైన్లను నిలిపివేసి, తాళం వేశారని వెల్లడించారు. శ్రీనివాసులు ఎస్పీ ఫక్కీరప్పను స్వయంగా కలిసి ఫిర్యాదు ఇవ్వటంతో పాటు ఫిర్యాదు కాపీలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, రాష్ట్ర డీజీపీకి కూడా పంపారు. ఎస్పీ ఆదేశాలతో ఉరవకొండ సీఐ హరినాథ్ ఇరు పక్షాలను పిలిపించి సమస్య పరిష్కరించామని చెప్పారు.
ఇవీ చదవండి: