రైతులకు మేలు చేయాలని ప్రభుత్వం తెచ్చిన ఆధునిక సమాచార, సాంకేతిక పరిజ్ఞానం క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. రైతులు విత్తనం కొనుగోలు నుంచి ఎరువులు, పురుగు మందుల వాడకం వరకు అన్ని ప్రక్రియలను నమోదు చేయటానికి సాంకేతిక సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసింది. అధికారులు సైతం ఈ-కర్షక్ ద్వారా రైతులు ఏ పంట సాగు చేసారన్న వివరాలను నమోదు చేస్తున్నారు. అనంతపురం జిల్లావ్యాప్తంగా రైతులు అధిక విస్తీర్ణంలో కంది సాగు చేశారు. తీరా పంటను అమ్ముకుందామని కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే మార్క్‌ఫెడ్ నిబంధనలతో అవస్థలు పడుతున్నారు. ఈ-కర్షక్‌లో తమ పేర్లే లేవని, వేసిన పంట వివరాలు కనిపించడం లేదని చెబుతూ సరకును తిరస్కరిస్తున్నారంటూ రైతులు వాపోతున్నారు.
ఈ-కర్షక్‌లో పేర్లు గల్లంతు
ఈ-కర్షక్ ద్వారా సేకరించిన కంది రైతుల వివరాలను అంతర్జాలంలో పరిశీలిస్తే.. ఆ రైతుల పేర్లు, పంట వివరాలే కనిపించని పరిస్థితి నెలకొంది. పంట నమోదు చేసుకున్న రైతుల నుంచి మాత్రమే కందులు కొంటామని అధికారులు తేల్చి చెప్పడంతో అన్నదాతలు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. అధికారుల అలసత్వం, మార్క్‌ఫెడ్ నిబంధనలతో ఆరుగాలం శ్రమించిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రైతు సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు.
పేర్లు ఉంటేనే కొనుగోలు
జిల్లాలో పంట నమోదు ప్రక్రియ సక్రమంగా జరగకపోగా.. మరోపక్క తప్పుగా నమోదు చేసిన పంట వివరాలు గందరగోళం సృష్టిస్తున్నాయి. రైతులు కంది పంట సాగుచేస్తే, వేరుశనగ విత్తుకున్నట్లుగా నమోదవడంతో పొరపాట్లు జరిగాయని మార్క్‌ఫెడ్ అధికారులు అంగీకరిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఈ-కర్షక్‌లో పేర్లు నమోదు చేసుకున్న వారి నుంచి మద్దతు ధరకు సరకు కొనుగోలు చేస్తామని వారు తెలిపారు.
అంతర పంటకు చిక్కు
జిల్లావ్యాప్తంగా కంది కోతలు పూర్తయి అధిక మొత్తంలో దిగుబడులు కేంద్రానికి వస్తున్నాయని వ్యవసాయశాఖ జేడీ హబీబ్ బాష అన్నారు. కందిని ఏకపంటగా సాగు చేసిన రైతుల పేర్లు సక్రమంగానే ఉన్నాయని.. అంతర పంటగా కంది సాగు చేసిన వారికి మాత్రమే ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. రైతుల సమస్యను పరిష్కరించేందుకు వారు సాగు చేసిన కంది పొలాలను వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన తరువాతనే పంట కొనుగోలుకు అవకాశం ఇస్తామని ఆయన తెలియజేశారు.
పంట నమోదు ప్రక్రియ పూర్తిస్థాయిలో జరగనందున.. క్షేత్రస్థాయిలో పరిశీలించిన తరువాతనే కందులు కొనుగోలు చేసేందుకు అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి : రాయచోటిలో కందిపప్పు కుంభకోణం