అనంతపురం జిల్లాలో 3,012 చౌక దుకాణాలున్నాయి. ప్రతినెలా 12,07,444 కార్డులకు 18 వేల మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయిస్తున్నారు. అయితే పలుచోట్ల పౌరసరఫరాలశాఖ ఉప తహసీల్దార్లు డీలర్లతో కుమ్మక్కయ్యారు. నామమాత్రపు తనిఖీలతో సొమ్ము చేసుకుంటున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. నెలనెలా మామూళ్లు ఇస్తున్నాం. మాకేం భయం అంటూ చాలామంది డీలర్లు అందినకాడికి దోచేస్తున్నారు. ఒక కుటుంబంలో నలుగురు సభ్యులు ఉంటే 20 కిలోల బియ్యం ఇవ్వాలి. కానీ తక్కువ తూకంతో 17 కిలోలే అందుతున్నాయి. ఈ-పాస్ యంత్రంలో డీలరు ఏం నొక్కుతారో కార్డుదారునికి తెలియదు. అడిగితే సర్వర్ పనిచేయడం లేదని సమాధానం చెబుతున్నారు. మరోవైపు డబ్బాతో కలిపి బియ్యం తూకం వేస్తున్నారు. ఇలా ప్రతి కార్డుకు రెండు, మూడు కిలోలు బొక్కేస్తున్నారు. ఈ బియ్యం పక్కదారి పట్టించి సొమ్ము చేసుకుంటున్నారు. చివరికి డీలర్లు, వ్యాపారులు తప్పించుకుని, వాహనదారులు కేసుల్లో ఇరుక్కుంటున్నారు.
అదెలాగంటే…
పలువురు స్టాక్ పాయింట్ల నిర్వాహకులు, డీలర్లు నొక్కేసిన బియ్యాన్ని వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వ్యాపారులు పొరుగున ఉన్న కర్ణాటక ప్రాంతానికి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పోలీసులు, విజిలెన్స్ అధికారుల తనిఖీల సమయంలోనే రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారం బయటపడుతోంది. లేదంటే యథేచ్ఛగా రవాణా సాగుతోంది. పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. జేసీ కోర్టులో 6ఎ కేసు నమోదు చేస్తారు. అనంతరం జేసీ అనుమతితో పట్టుబడిన బియ్యాన్ని కార్డుదారులకు పంపిణీ చేస్తారు. వచ్చిన సొమ్ము మొత్తాన్ని చలానా రూపంలో జిల్లా ఖజానాశాఖకు జమ చేస్తారు. కేసు విచారణ పూర్తి కాగానే తప్పుతేలితే బియ్యం సొమ్ము, జరిమానా సొమ్మంతా ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తున్నట్లు పౌరసరఫరాలశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
ఉచితం మాటున దోపిడీ
కరోనా కారణంగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఉచితంగా బియ్యం, కందిపప్పు/శనగలు ఇస్తున్నారు. నెలకు రెండు దఫాలుగా ఇప్పటికే ఏడు నెలలుగా సరఫరా చేశారు. ప్రస్తుతం 14వ విడత పంపిణీ కొనసాగుతోంది. చాలాచోట్ల పాత పద్ధతిలో డబ్బాలతో బియ్యం తూకం వేస్తున్నారు. మరికొన్నిచోట్ల తక్కువ తూకాలతో సరిపెడుతున్నారు. కార్డుదారులు అడిగితే ఉచితంగా ఇస్తున్నాం తీసుకోండి.. లేకపోతే వదిలేయండని డీలర్లు బుకాయిస్తున్నారు. మరోవైపు స్టాక్ పాయింట్ల వద్ద బస్తాకు 3 కిలోల చొప్పున టన్నుకు 60 కిలోలు తక్కువ ఇస్తున్నారని డీలర్లే చెబుతున్నారు. ఒకసారికి 18 వేల టన్నుల చొప్పున, నెలకు రెండుసార్లు 36 వేల టన్నులు పంపిణీ చేస్తున్నారు. ఈ లెక్కన నెలకు 2,160 మెట్రిక్ టన్నుల బియ్యం నొక్కేస్తున్నారు. మార్కెట్ విలువ ప్రకారం ఏడు నెలలకు రూ.5.45 కోట్లు జేబులు నింపుకొన్నారు. ఓ వైపు డీలర్లు, మరోవైపు స్టాక్‌పాయింట్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అందినకాడికి దోచేస్తున్నారు.
2019 జనవరి నుంచి ఇప్పటివరకు కేసుల వివరాలు గమనిస్తే..115 విజిలెన్స్ కేసుల్లో 7,732 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నారు. సరుకు విలువ రూ. 49,17,759 కోట్లు. ఇక 202 పౌరసరఫరాలశాఖ కేసులు నమోదు కాగా 12 వేల క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నారు. దీని విలువ రూ.1.72 కోట్లు.
తప్పుచేస్తే తప్పించుకోలేరు
“ ప్రజా పంపిణీ వ్యవస్థ సక్రమంగా అమలు కావాల్సిందే. ప్రతి కార్డుదారునికి సకాలంలో కచ్చితమైన తూకంతో బియ్యం, ఇతర సరకులు అందాలి. అయితే అక్కడక్కడ తూకాల్లో మోసం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చింది. సర్వర్ పనిచేయలేదని, సాకులు చెబుతూ పేదలకు ఇబ్బందులు పెట్టడం సరికాదు. చట్టానికి ఎవరూ అతీతులు కాదు. డీలర్లు, వ్యాపారులు, సిబ్బంది ఎవరైనా తప్పు చేస్తే తప్పించుకోలేరు.” - రఘురామిరెడ్డి, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి
ఇవీ చదవండి: గుంటూరులో విద్యుత్ శాఖ ఉద్యోగులు నిరసన