కార్, బైక్ రేస్‌లపై యువతలో ఏటికేడు అభిరుచి పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ రేస్‌లకు ఆదరణ ఎక్కువగా ఉండగా... దేశంలో కొన్నాళ్లుగా ప్రాధాన్యత ఏర్పడింది. అందుకే గత ప్రభుత్వం అనంతపురం జిల్లా తనకల్లు వద్ద 219 ఎకరాల్లో రేస్ ట్రాక్ నిర్మించాలని ప్రతిపాదించింది. బెంగుళూరుకు చెందిన నిధి మార్ క్యూ సంస్థ నిర్మించేందుకు ముందుకు వచ్చింది. 2018 మే 23న తనకల్లు మండలం కోటపల్లి వద్ద 219 ఎకరాల భూమిని నిధి మార్ క్యూ సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. 3 దశల్లో ఈ ప్రాజెక్టును పూర్తిచేస్తామన్న సంస్థ... 150 నుంచి 250 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఒప్పందం మేరకు 18 నెలల్లో తొలిదశ రేస్ ట్రాక్, రిసార్ట్స్, 5 నక్షత్రాల హోటల్ నిర్మాణాలు పూర్తిచేయాల్సి ఉంది.
దేశంలో మూడో పెద్దదైన రేస్ ట్రాక్ నిర్మాణం జరిగితే కార్లు, మోటర్ సైకిళ్ల తయారీ సంస్థలు తమ ఉత్పత్తుల సామర్థ్యం పరీక్షించుకొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ సంస్థలన్నీ కొత్త ఉత్పత్తుల సామర్థ్యం పరీక్షకు చెన్నైకు వెళుతున్నాయి. అందుకే... రేస్ ట్రాక్ నిర్మాణం పూర్తిచేయాలని ఇప్పటికే అనేకసార్లు ప్రభుత్వాన్ని కోరాయి. 6 నెలల క్రితం పని మొదలుపెట్టినా... నిధి మార్ క్యూ సంస్థ కనీసం కోటి రూపాయల విలువచేసే పనులు చేయలేదు. స్థానికులకు కనీసం కూలీ పని కల్పించలేదు.
ప్రాజెక్టు పనుల నిర్వహణలో తీవ్ర జాప్యం చేస్తున్న నిధి మార్ క్యూ సంస్థకు తాఖీదులివ్వటానికి పర్యటక శాఖ అధికారులు సిద్ధమయ్యారు. ఒప్పందం మేరకు పనులు నిర్వహించకపోతే ఎలా ముందుకెళ్లాలనే విషయంపై న్యాయ నిపుణుల సలహా తీసుకోనున్నారు.
ఇదీ చదవండి: