Problems of Kidney Patients: అనంతపురం జిల్లాలోని గుంతకల్లు మండల పరిధిలో ఉన్న మెులకలపెంట గ్రామంలో.. రోజురోజుకు కిడ్నీ బాధితుల సంఖ్య రెట్టింపు అవుతున్నా.. నివారణ చర్యల్లో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. గుంతకల్లు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో..ఇద్దరు లేదా ముగ్గురికి పైగా కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారన్న అంచనాలు ఉన్నాయి.
మూత్రపిండాల వ్యాధితో గ్రామంలో ఇప్పటికే ఇద్దరు మృతిచెందగా.. మరో నలుగురు డయాలసిస్ చేయించుకుంటున్నారు. వీరికి వారానికి 2 నుంచి 3 సార్లు డయాలసిస్ చేయించాల్సిన అవసరం ఉంటుంది. డయాలసిస్ కోసం కుటుంబ సభ్యులతో ప్రత్యేక వాహనాల్లో జిల్లా కేంద్రాల్లోని డయాలసిస్ కేంద్రాలకు వెళ్లటం భారంగా మారిందని వాపోతున్నారు.
గ్రామంలో పరీక్షలు నిర్వహిస్తే.. మరికొంతమందిలో వ్యాధి బయటపడే అవకాశం ఉందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితుల కోసం గుంతకల్లులో చేపట్టిన ఆస్పత్రిని అందుబాటులోకి తెస్తే దూరాభారం తగ్గుతుందని గ్రామస్థులు కోరుతున్నారు. కిడ్నీ బాధితుల కోసం చర్యలు చేపడతామన్న ప్రజా ప్రతినిధులు.. ప్రస్తుతం ఆస్పత్రి ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పలేని స్థితిలో ఉన్నారని.. గ్రామస్థులు వాపోయారు. మొలకలపెంట గ్రామం మరో ఉద్దానం కాక ముందే.. అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.
"ఈ కిడ్నీ వ్యాధి వలన మా తమ్ముడు చనిపోయాడు. ఇప్పుడు నాకు వచ్చింది. చాలా దూరం వెళ్లి డయాలసిస్ టెస్ట్ చేపించుకోవాలి. అంత దూరం వెళ్లి రావడం వలన.. ప్రభుత్వం ఇస్తున్న పింఛను ఏ మాత్రం సరిపోవడం లేదు. నాకు గత 2 సంవత్సరాలుగా డయాలసిస్ చికిత్స అవుతుంది. కొత్త డయాలసిస్ సెంటర్ నిర్మిస్తే మా లాంటి వాళ్లకి ఉపయోగంగా ఉంటుంది". - ప్రకాష్, కిడ్నీ బాధితుడు
"ఇప్పటికే ఇద్దరు చనిపోయారు. మరో నలుగురం ఉన్నాము. డయాలసిస్ చికిత్స చేపించుకుంటున్నాం. అనంతపురంకి వెళ్లి పరీక్షలు చేపించుకుంటున్నాం. వెళ్లి రావడానికి కష్టంగా ఉంది. గ్రామంలో అందరికీ పరీక్షలు చేస్తే మరికొంత మందికి ఉండే అవకాశం కూడా ఉంది. గుంతకల్లులో డయాలసిస్ సెంటర్ పెడితే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. మాకు నెలకు ఏడు వేల వరకూ ఖర్చు అవుతోంది. కాబట్టి పింఛను పెంచాలని కోరుతున్నాం". - బాలకృష్ణ, కిడ్నీ బాధితుడు
"గ్రామంలో కిడ్నీ రోగులు నలుగురు ఉన్నారు. నీళ్లు బాగానే ఉన్నాయని అన్నారు. మరి ఎందువలన వస్తుందో తెలియడం లేదు. డయాలసిస్ కోసం అనంతపురం పోతున్నారు. కొంతమంది కర్నూలు పోతున్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్లకి మందు అలవాటు కూడా లేదు. పరీక్షలు చేస్తున్నారు. కానీ ఏం అర్థం కాని పరిస్థితి ఉంది". - మురహరి నాయుడు, సర్పంచ్
ఇవీ చదవండి: