అనంతపురంలోని పలు కాలనీలు మురికికూపాలను తలపిస్తున్నాయి. ప్రజలు పందులతో సహజీవనం చేయాల్సిన దయనీయ స్థితి నెలకొంది. పారిశుద్ధ్యాన్ని సిబ్బంది గాలికొదిలేయగా ఆ పాపం ప్రజలను పీడిస్తోంది. నగరంలో 262 కాలనీల్లో పదుల సంఖ్యలో వాడలది ఇదే పరిస్థితి. పాతూరులో ఆక్రమణలు పెచ్చుమీరిపోగా... మురుగుకాల్వలు మూసుకుపోయాయి. ఎక్కడికక్కడ మురుగు నిలిచిపోతున్న పరిస్థితుల్ని పట్టించుకునేవారే కరవయ్యారు.
అనంత నగరంలోని 188 కాలనీల్లో మురుగుకాల్వలను ఆక్రమించి..... గృహాలు, దుకాణ సముదాయాలు నిర్మించారు. చర్యలు తీసుకోవాల్సిన ప్రణాళిక విభాగం అధికారులు..... ఆక్రమణదారులతో కుమ్మక్కవుతున్నారనే ఆరోపణలున్నాయి. మురుగు, చెత్తాచెదారం అంతా నివాస ప్రాంతాల్లోనే నిలిచి పందులు, దోమలు స్త్వైరవిహారం చేస్తున్నాయి. పందుల బెడద మరీ ఎక్కువైపోగా..వాటిని తరలించేవారూ కరవయ్యారని కాలనీల ప్రజలు వాపోతున్నారు.
పారిశుద్ధ్య సిబ్బంది పర్యవేక్షణ లేదు!
నగరంలో కాలనీల పారిశుద్ధ్యం కోసం ప్రత్యేక వ్యవస్థ ఉంది. 180 మంది శాశ్వత కార్మికులు, 409 మంది ఒప్పంద సిబ్బందిని నియమించారు. వీరి పర్యవేక్షణకు పెద్ద యంత్రాంగమే ఉంది. ఈ మధ్యే 74 వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం..74 మంది పారిశుద్ధ్య కార్యదర్శులను నియమించింది. 50 డివిజన్లున్న నగరానికి ఇంతపెద్ద వ్యవస్థ ఉన్నప్పటికీ.. పారిశుధ్య నిర్వహణలో మార్పరావడం లేదు. కాలనీల్లో పనులపై వార్డు సచివాలయ సిబ్బంది పర్యవేక్షణ కొరవడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అనంతపురంలో గతంలో పర్యటించిన పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ..... మురుగు, చెత్త సమస్య పరిష్కారంపై ఇచ్చిన హామీలు ఆచరణలోకి రాలేదు.
ఇదీ చదవండి: