Paritala Sunitha Protest Against Chandrababu Arrest: చంద్రబాబుకు మద్దతుగా అనంతపురంలో మాజీ మంత్రి పరిటాల సునీత చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఉదయమే పెద్ద ఎత్తున దీక్షా శిబిరం వద్దకు చేరుకున్న పోలీసులు.. పరిటాల సునీతకు మద్దతుగా నిలిచిన మహిళలను బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. పరిటాల సునీతను అక్కడి నుంచి తరలిచేందుకు ప్రయత్నించగా.. ఆమె ప్రతిఘటించారు. కండువాతో మెడ చుట్టూ బిగించుకుంటానని హెచ్చరించారు. అయినా పోలీసులు.. పరిటాల సునీతను అక్కడి నుంచి బలవంతంగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీక్షా శిబిరంలో ఎవరూ ఉండకుండా అక్కడి నుంచి అందర్నీ పంపించేశారు.
"టీడీపీ అధినేత చంద్రబాబు కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం. చంద్రబాబును విడుదల చేసేంత వరకు మా పోరాటం ఆగదు. ఈ క్రమంలో చంద్రబాబు మద్దతుగా మేము ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాము. అయితే మా దీక్షా శిబిరం వద్దకు పోలీసులు ఈరోజు ఉదయాన పెద్ద ఎత్తున చేరుకుని.. ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా నిలిచిన మహిళలను బలంవంతగా తరలించారు. పోలీసులు మమ్మల్ని తరలించేందుకు ప్రయత్నించగా.. మేము కండువాతో మెడ చుట్టూ బిగించుకుంటామని హెచ్చరించాము. అయినా కూడా వారు మమ్మల్ని బలవంతగా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శాంతియుతంగా మేము నిరసనకు దిగితే.. పోలీసులు అడ్డుకోవడం దారుణం" - సునీత, మాజీమంత్రి
చంద్రబాబు కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమని.. పరిటాల సునీత పునరుద్ఘాటించారు. సునీత ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేసిన పోలీసులు.. ఆమెను అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శాంతియుతంగా నిరసనకు దిగితే.. పోలీసులు అడ్డుకోవడం దారుణమని సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. దీక్ష చేయొద్దనే ఉద్దేశంతోనే.. వైద్యులు బలవంతంగా సెలైన్ ఎక్కించారని మండిపడ్డారు. ఏది ఏమైనా చంద్రబాబు విడుదలయ్యే వరకు పోరాడుతూనే ఉంటానని ఆమె స్పష్టం చేశారు. సునీతకు మద్దతుగా ఆస్పత్రికి తెలుగుదేశం కార్యకర్తలు తరలివచ్చారు. రాష్ట్ర భవిష్యత్ కోసమే బాబు జైలుకు వెళ్లారని.. పరిటాల శ్రీరామ్ అన్నారు. ఈక్రమంలో ఆంక్షలు, అరెస్టులకు వెరవకుండా కార్యకర్తలు పోరాడాలని పిలుపునిచ్చారు.
సునీతను ఆసుపత్రిలో పరామర్శించిన మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, పల్లె రఘునాథరెడ్డిలు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. పరిటాల సునీత శిబిరం వద్ద పోలీసులు విచక్షణరహితంగా వ్యవహరించారని కాలవ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తగినంత మంది మహిళా పోలీసులు లేకుండానే వెళ్లి, శిబిరంలో దీక్ష నిర్వహిస్తున్న మహిళలను ఈడ్చిపడేశారని ఆరోపించారు. పోలీసులు తమపై ఎందుకు ఇంత కక్ష కట్టారని కాలవ ప్రశ్నించారు. పరిటాల సునీత ఆమరణ దీక్షతో వైసీపీ నాయకుల్లో భయం పుడుతోందని, అందుకే అర్ధరాత్రి కారుతో శిబిరం చుట్టూ చక్కర్లు కొట్టారన్నారు.
ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎంతమంది గూఢాచారులను పెట్టుకున్నా పరిటాల సునీత దీక్షను ఆపలేరని కాలవ స్పష్టం చేశారు. రానున్నది చంద్రబాబు నాయుడు ప్రభుత్వమేనని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు హెచ్చరించారు. శాంతియుతంగా నిరసనలు కూడా చేయనివ్వరా అంటూ పోలీసులపై పల్లె రఘునాథరెడ్డి మండిపడ్డారు. పరిటాల సునీత రక్తపోటును అదుపులోకి తెచ్చిన వైద్యులు, ఆమెకు రెండు రోజులు విశ్రాంతి అవసరమని సూచించి.. ఇంటికి పంపించారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలతో కలిసి సునీత ఇంటికి వెళ్లారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో తెలుగుదేశం వాల్మీకి నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. దీక్షా శిబిరం నుంచి టవర్ క్లాక్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం 14వ రోజు రిలే నిరహార దీక్షలో పాల్గొన్నారు. 'సైకో పోవాలి.. సైకిల్ రావాలి' అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు నాయుడును వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.