పరిటాల రవి...తెలుగు రాజకీయాల్లో ఈ పేరు ఓ సంచలనం. అనంతలోనే కాదు... రాష్ట్రవ్యాప్తంగా పరిటాల రవికి అభిమానగణం ఉంది. ఆయన వారసుడిగా పరిటాల శ్రీరాం పోటీపై కొంత కాలంగా ఆసక్తి రేగుతోంది. శ్రీరామ్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే చర్చ జరిగింది. మొదటగా ఆయనను ఎంపీకి పోటీకి దింపుతున్నారన్న ప్రచారం సాగినా...చివరికి సొంత నియోజకవర్గం రాప్తాడు నుంచే తెదేపా అభ్యర్థిగా బరిలోకి దిగారు.
తనయుడి కోసం తల్లి..
రాప్తాడు నియోజకవర్గం ఎమ్మెల్యేగా పరిటాల సునీత రెండు సార్లు విజయం సాధించారు. అయితే ఈసారీసునీత రాప్తాడు నుంచే పోటీలో నిలిచి...శ్రీరామ్‌కు మరోస్థానం కేటాయించాలని కోరారు. కానీ ఆయా స్థానాల్లో ఆశావహులు భారీగా ఉన్నందునఆ ఆలోచనను విరమించుకున్నారు. కుమారుడుని ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపాలన్న లక్ష్యంతో సునీత పోటీ నుంచి దూరంగా జరిగారు.రాప్తాడు కుమారుడికే టికెట్ ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరిశ్రీరామ్కు గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నారు.
క్యాడర్లో జోష్...
పరిటాల రవీంద్ర మరణాంతరం కొంత నిరుత్సాహంలో ఉన్న క్యాడర్లో శ్రీరాం రాజకీయ రంగప్రవేశంఉత్సాహాం పెంచింది. కొంతకాలంగా తండ్రి పేరు మీద సంక్షేమ కార్యక్రమాలను చేపడుతూ కార్యకర్తల్లో జోష్పెంచుతున్నారు. యువతను తెదేపా వైపు మళ్లించేందుకు శ్రీరాం ప్రయత్నాలు చేస్తున్నారు.
పెనుగొండ టూ రాప్తాడు..
పెనుగొండ.... అంటేనే పరిటాల కుటుంబానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉండేది. ఆ నియోజకవర్గం నుంచి పరిటాల రవీంద్ర హ్యాట్రిక్ కొట్టారు. గెలిచిన ప్రతిసారీభారీ మెజార్టీనే. నియోజకవర్గాల పునర్విభజనతో పెనుగొండలోని కొన్ని మండలాలు వేరు చేసి రాప్తాడు నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్నుంచి పరిటాల సునీత రాప్తాడు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. ఈ కారణంతో కొంత ఓటు బ్యాంకుకోల్పోయింది పరిటాల కుటుంబం. ఫలితంగా గెలిచిన 2సార్లు 10 వేల లోపు మెజార్టీ మాత్రమే సొంతం చేసుకున్నారామె. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గట్టి పోటీనిచ్చారు. 2009 ఎన్నికల్లో ఆయన కేవలం 1700 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
విజయంపై ధీమా..
మొన్నటి వరకు తెర వెనక ఉండి అన్ని కార్యక్రమాలు సరిదిద్దుతున్న శ్రీరాం... ఇప్పుడు రాప్తాడు తెదేపా అభ్యర్థిగా బరిలో ఉన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో చుట్టేస్తూ ప్రజాసమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. పరిటాల కుటుంబంపై నియోజకవర్గంలో ఉన్న ప్రేమ.... బలమైన అనుచరగణం... మంత్రిగా సునీత చేసిన అభివృద్ధి పనులు... శ్రీరాం విజయానికి అనుకూలిస్తాయని పార్టీ శ్రేణలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే 2 సార్లు రాప్తాడును తమ ఖాతాలో వేసుకున్న పరిటాల కుటుంబం ఈసారీ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలనే ఆలోచనలో ఉంది.