వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించకలిగిన వ్యక్తి ఎన్టీఆర్ అని పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో జరిగిన ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కార్యకర్తలు, నాయకులతో కలసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేట్ కట్ చేశారు. సినీ రంగంలోనే కాక రాజకీయాల్లోనూ ఎన్టీఆర్ చెరగని ముద్ర వేశారని ప్రశంసించారు. అలాంటి మహానీయుడు స్థాపించిన తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వచ్చేలా అందరూ కష్టపడి పని చేద్దామని కోరారు.
కార్యకర్తలు చెమటోడ్చాలి
నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకొని అనంతపురం జిల్లా కదిరిలోని ఎన్టీఆర్ విగ్రహాలకు స్థానిక తెదేపా నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగువారి ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేసిన ఎన్టీఆర్ ఆశయాలను సాధించేందుకు ప్రతి కార్యకర్త తన వంతు బాధ్యతను నిర్వహించాలని కోరారు. పార్టీ అధినేత చంద్రబాబు మార్గదర్శకత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేలా కార్యకర్తలు కృషి చేయాలని నియోజకవర్గ బాధ్యుడు కందికుంట వెంకటప్రసాద్ సూచించారు.
రోగులకు సాయం
అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గ కేంద్రంలో ఎన్టీ రామారావు జయంతి వేడుకలను తెదేపా శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఎన్టీఆర్ కూడలిలోని ఆయన విగ్రహానికి పలువురు తెదేపా నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు. రాష్ట్ర కురుబ కార్పొరేషన్ ఛైర్మన్ సవిత, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నిరుత్సాహపడవద్దు.. కృషి చేయండి
స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను కళ్యాణదుర్గం పార్టీ కార్యాలయంలో ఉత్సాహంగా నిర్వహించారు. ఉమామహేశ్వర నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. పార్టీ పరాజయం పాలైందని నిరుత్సాహ పడకుండా ప్రతిపక్ష పార్టీ చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు అందరూ సహకరిద్దామని సూచించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు వేసి నివాళులు అర్పించారు.
మహనీయుడికి నివాళి
దేశ చరిత్రలోనే తెలుగు జాతి ఔన్నత్వాన్ని, గౌరవాన్ని చాటిన మహాశక్తి స్వర్గీయ నందమూరి తారకరామారావు అని అనంతపురం అర్బన్ తెదేపా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అన్నారు. నగరంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి తెదేపా నాయకులతో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు.