No Proper Food to Poilce in CM Tour: సీఎం పర్యటన కోసం బందోబస్తుకు వచ్చిన పోలీసులు ఆకలితో అలమటించారు. అనంతపురం జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్న సంగతి తెలిసిందే. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా కళ్యాణదుర్గంలో నిర్వహించనున్న వైఎస్సార్ రైతు దినోత్సవం కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ పర్యటనకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే బందోబస్తు కోసం తెల్లవారుజామున 3 గంటలకే కార్యక్రమం జరిగే ప్రదేశానికి వచ్చిన పోలీసులకు ఉదయం 10 గంటలైనా టిఫిన్ అందకపోవడంతో పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వస్తున్నారని.. సమీపంలోని హోటళ్లు, దుకాణాలు మూసివేయడంతో తినడానికి టిఫిన్ దొరక్క తీవ్ర అవస్థలు పడ్డారు. దీర్ఘకాలిక జబ్బులు, బీపీ, షుగర్ ఉన్న సిబ్బంది పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఈ క్రమంలో ఒక వాహనంలో అల్పాహారం తీసుకొచ్చారు. ఇంకేముంది ఆకలితో అల్లాడుతున్న పోలీసులకు పొట్లాలు కనిపించడంతో వాటి కోసం ఎగబడ్డారు. అందులో కొంతమందికే అల్పాహారం దక్కింది. తెచ్చిన అల్పాహార పొట్లాలు అయిపోవడంతో మిగిలిన వారంతా నిరాశతో వెనుదిరిగారు.
అడుగడుగునా పోలీసులే: మరోవైపు కళ్యాణదుర్గంలో సీఎం పర్యటన నేపథ్యంలో అడుగడుగునా పోలీసులే కనిపించారు. ప్రధాన రోడ్లపై నుంచి వేదిక పైకి వెళ్లే మార్గంలో ఇరువైపులా వైఎస్సార్సీపీ రంగులతో కూడిన ఎత్తైన పరదాలు కట్టారు. ముఖ్యమంత్రి కార్యక్రమం 11 గంటలకు అయినా.. ఉదయం నుంచి పట్టణంలో ఆంక్షలు విధించారు. అన్ని ప్రధాన కూడళ్లలో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేసి అవసరమైన వారిని మాత్రమే అనుమతించారు. బాంబు స్క్వాడ్ సిబ్బంది ప్రతిచోట క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. హెలికాప్టర్ దిగి సీఎం ప్రయాణించే రహదారి వెంట ఇరువైపుల బారికేడ్లు ఏర్పాటు చేశారు.
చెట్ల నరికివేత: సీఎం పర్యటన ఎక్కడైనా.. చెట్లు నరకడం, దుకాణాలు, హోటళ్లు మూసివేయించడం కామన్ అయిపోయింది. పరిసరాలు శుభ్రం చేసి మొక్కలు నాటాల్సింది పోయి.. పచ్చని చెట్లు నరికేస్తారు. భారీ వృక్షాలను జేసీబీలతో పెకలించేస్తారు. పర్యావరణ విధ్వంసం మామూలుగా ఉండదు. తాజాగా అనంతపురంలో కూడా ఇదే తంతు కొనసాగింది. ఈరోజు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు. వైఎస్సార్ అగ్రి ల్యాబ్లను ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో పర్యటన ఏర్పాట్ల పేరుతో అధికారులు, పోలీసులు చేసేన హడావుడి అంతా ఇంతా కాదు. ముఖ్యమంత్రి దిగడానికి ఏర్పాటు చేసిన హెలిపాడ్ నుంచి పట్టణంలోకి వెళ్లే రహదారిలో ధర్మవరం రోడ్డు పక్కనున్న చెట్ల కొమ్మలు నరికేశారు. ఇదిలా ఉంటే.. రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా విద్యుత్ తీగలకు అడ్డంగా ఉన్నాయంటూ.. చెట్ల కొమ్మలు తొలగించేశారు. పచ్చని చెట్లను బలవంతంగా కూల్చేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.