చేనేత, మరమగ్గాల చప్పుళ్లతో నిత్యం సందడిగా ఉండే ధర్మవరం.. ఒక్కసారిగా మూగబోయింది. శనివారం రాత్రి జరిగిన బస్సు ప్రమాదంలో ఏకంగా తొమ్మిదిమంది మృతి చెందడం, 42 మంది తీవ్రంగా గాయపడటంతో పట్టణం విషాదంలో మునిగిపోయింది.
భర్త అంత్యక్రియలు జరుగుతుండగానే భార్య మృతి..
పట్టణంలోని పీఆర్‌టీ కాలనీకి చెందిన మలిశెట్టి వెంగప్ప, మలిశెట్టి నాగలక్ష్మి మృతి చెందారు. వెంగప్ప ప్రమాదస్థలిలోనే మృతి చెందగా నాగలక్ష్మి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. చేనేత మగ్గాలు నేస్తూ జీవనం చేస్తున్నారు. సత్యసాయి భక్తుడైన వెంగప్ప మృతితో కాలనీలో విషాదం నెలకొంది. ఆయన మృతదేహానికి స్థానిక గాంధీనగర్ హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తుండగా.. అదే సమయంలో నాగలక్ష్మి మృతి చెందిన విషయం కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా తెలియడంతో కన్నీటి పర్యంతమయ్యారు.
చేనేత ఇంట్లో విషాదం..
పెళ్లి కుమారుడు వేణు తండ్రి మలిశెట్టి మురళి, బాబాయి మలిశెట్టి గణేష్, మరో చిన్నాన్న శివ భార్య కాంతమ్మ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ధర్మవరానికి చెందిన మురళి 20 ఏళ్లుగా స్థానికంగా పట్టుచీరల దుకాణం నిర్వహిస్తున్నారు. మగ్గాలు నేసే స్థాయి నుంచి సొంత దుకాణం ఏర్పాటు చేసుకునే వరకు అంచెలంచెలుగా ఎదిగారు. వ్యాపారంలో తమ్ముడు గణేష్ చేదోడుగా ఉండేవారు. వేణు చీరల వ్యాపారంలో తండ్రికి సహాయంగా ఉండేవారు. గణేష్‌కు భార్య, కుమార్తె, కుమారుడు చరణ్ ఉన్నారు. అన్నదమ్ములిద్దరూ వ్యాపారంలో రాణించి ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. తీవ్రంగా గాయపడిన గణేష్ భార్య భైరవి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పెళ్లికొడుకు వేణు గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
పెద్ద దిక్కును కోల్పోయి..
బస్సు డ్రైవర్ రసూల్ స్వస్థలం నార్పల మండలం గూగూడు. ధర్మవరం పట్టణానికి వలస వచ్చి స్థిరపడ్డారు. ఈయనకు భార్య షేక్ శంషాద్‌బేగం, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబం మొత్తం రసూల్ సంపాదనపైనే జీవిస్తోంది. ఆయన మరణించడంతో భార్య, పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
చివరి నిమిషంలో బస్సెక్కి..
బుక్కపట్నం మండలం మారాలకు చెందిన ఆదినారాయణరెడ్డి ఓ పత్రిక విలేకరిగా కొంతకాలం ధర్మవరంలో పనిచేస్తూ అక్కడే స్థిరపడ్డారు. ప్రస్తుతం అనంతపురం కేంద్రంగా పనిచేస్తున్నారు. మురళితో చాలాకాలంగా పరిచయం ఉంది. ఆ స్నేహంతోనే నిశ్చితార్థానికి పిలవడంతో చివరి నిమిషంలో బస్సు ఎక్కాడు. ఆయనకు భార్య గౌతమి, కుమార్తె మనీషా (10వ తరగతి), కుమారుడు గణేష్ (5వ తరగతి) ఉన్నారు. తల్లిదండ్రుల బాగోగులు తనే చూసుకునేవారు. తమకు దిక్కెవరయ్యా అంటూ కుటుంబ సభ్యులు రోదించారు.
కదిరి నుంచి వలస వచ్ఛి..:
బస్సు క్లీనర్ షకీల్ స్వస్థలం కదిరి పట్టణం. తండ్రి సలీమ్ 25 ఏళ్ల కిందట వలస వచ్చాడు. మగ్గం నేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లి సుల్తాజ్ పట్టణంలోని మున్సిపల్ పాఠశాలలో వంట మనిషి. వీరికి ఇద్దరు కుమారులు కాగా.. షకీల్ పెద్దవాడు. ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. షకీల్ బస్సు క్లీనర్‌గా పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉండేవాడు.
వారించినా వినలేదు..: పెళ్లి కుమారుడు వేణు కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ధర్మవరం నుంచి శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో బయలుదేరారు. ప్రయాణం మొదలైనప్పటి నుంచి డ్రైవర్ రసూల్ బస్సును వేగంగా నడిపారని, ఘాట్ రోడ్డులోనూ వేగం తగ్గకపోవడంతో ఒకటి, రెండుసార్లు వారించామని బాధితులు తెలిపారు. భాకరాపేట ఘాట్ రోడ్డులోని ఓ మలుపులో స్పీడ్ బ్రేకర్ల వద్ద కూడా వేగంగా వెళ్లడంతో బస్సు ఒక్కసారిగా పైకిలేచింది. నియంత్రించడానికి వీలుకాకపోవడంతో అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది.
భర్త, కుమారుడి కోసం ఆరాటం..: నా భర్త, కుమారుడిని ఒక్కసారి చూడాలంటూ ప్రమాదంలో గాయపడిన స్వప్న విలపించింది. దంపతులు జి.వేణుగోపాల్, స్వప్న, వారి కుమారుడు ప్రేమ్‌కుమార్ బస్సు ప్రమాదానికి గురయ్యారు. రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్వప్నకు ఎక్స్‌రే తీయాల్సి ఉండగా మొదట భర్తను, కుమారుడిని చూడాలని వైద్యులను వేడుకుంది. దీంతో వైద్యులు గాయపడిన భర్త, కుమారుడితో మాట్లాడించడంతో వైద్యానికి సహకరించింది.
ఒకే కుటుంబంలో నలుగురికి తీవ్రగాయాలు..: రామ్‌నగర్‌కు చెందిన దంపతులు పి.బాలకొండ, రమాదేవి, కుమారుడు రాయుడు, కుమార్తె అనిత ప్రమాదంలో గాయపడ్డారు. రమాదేవికి రెండు కాళ్లు విరిగాయి. అనిత కూడా తీవ్ర గాయాలపాలైంది. కళ్లు మూసి తెరిచేలోగా అంతా జరిగిపోయిందని ఆవేదనకు గురయ్యారు. దేవుడి దయతో బయటపడ్డామని బాలకొండ తెలిపారు.
ఆ దంపతుల సమాచారంతోనే ముందుకు..: ధర్మవరానికి చెందిన ధనుంజయ్, అతని భార్యకు బస్సు ప్రయాణం పడకపోవడంతో రెండేళ్ల కుమారుడితో కలిసి రైలులో తిరుపతికి బయలుదేరారు. రాత్రి 9 గంటలకు తిరుపతి చేరుకున్నారు. బస్సులో వస్తున్న తమ బంధువులకు పలుమార్లు ఫోన్ చేసినా స్పందన లేదు. అప్పటికే బస్సు ప్రమాదం విషయం టీవీ ఛానళ్ల ద్వారా తెలుసుకుని రాత్రి 11 గంటలకు రుయా ఆసుపత్రికి చేరుకుని తమవారి వివరాలు వెల్లడించారు.
ఆర్టీసీ బస్సులో వెళ్లిఉంటే..: పట్టుచీరల వ్యాపారి మురళి తొలుత ఆర్టీసీ బస్సును అద్దెకు తీసుకునేందుకు అధికారులను కలిశారు. తనకు తెలిసిన ఉద్యోగులతో ఆరా తీశారు. మళ్లీ కలుస్తానని వారితో చెప్పారు. అనంతరం ప్రైవేట్ బస్సులో వెళ్లారు.
ఆర్తనాదాలు విని..: 50 అడుగులకుపైగా లోయలో బస్సు పడిపోయింది. అందులోనూ రాత్రి సమయం కావడంతో చాలాసేపు ప్రమాద విషయం ఎవరికీ తెలియలేదు. సిగ్నల్స్ లేకపోవడంతో ఫోన్ చేసే వీలు లేకుండా పోయిందని క్షతగాత్రులు తెలిపారు. క్షతగాత్రుల ఆర్తనాదాలు విని అటువైపుగా వెళ్తున్న ప్రయాణికులు, వాహన చోదకులు పోలీసులకు సమాచారం అందించారు. అందరూ కలిసి సహాయక చర్యలు చేపట్టారు. లోయ నుంచి క్షతగాత్రులను రోడ్డుపైకి చేర్చడం కష్టంగా మారింది.
రైలు ప్రయాణంలో కలిసి..: ఇటీవల మలిశెట్టి మురళి వ్యాపార నిమిత్తం దిల్లీ వెళ్లి రైలులో తిరిగి వస్తుండగా.. ధర్మవరానికే చెందిన జింకా చంద్రశేఖర్‌తో పరిచయం ఏర్పడింది. మాటల మధ్యలో మురళీ తన కుమారుడు వేణు పెళ్లి విషయం ప్రస్తావనకు రాగా.. తిరుపతిలో మంచి సంబంధం ఉందని చంద్రశేఖర్ ద్వారా తెలిసింది. ఇలా రెండు కుటుంబాలకు పరిచయం ఏర్పడింది. అనంతరం వేణుకు, చిత్తూరు జిల్లా మాధవరానికి చెందిన అమ్మాయితో పెళ్లి ఖరారు చేశారు. నిశ్చితార్థం నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తుండగా.. ప్రమాదంలో మురళీతోపాటు చంద్రశేఖర్ కుమార్తె చందన మృత్యువాత పడ్డారు. బాలిక మూడో తరగతి చదువుతోంది.
వేగం తగ్గించాలని కేకలు వేశాం..: బంధువులతో కలిసి మాట్లాడుతూ ప్రయాణిస్తున్నాం. ఘాట్ రోడ్డుపై బస్సు వేగం తగ్గించకపోవడంతో మురళి అతని సోదరుడు గణేష్ గట్టిగా కేకలు వేశారు. వేగం తగ్గించాలని డ్రైవరును హెచ్చరించారు. అప్పటికే బస్సు అదుపు తప్పి లోయలో పడింది.
ఇదీ చదవండి: Visakha Steel: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ.. విశాఖ బంద్