Raithannato Lokesh Programme: జగన్ పాలనలో ప్రతి రైతుపై అప్పు.. రెండున్నర లక్షల రూపాయలకు పెరిగిందని.. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే.. పెట్టుబడి వ్యయం తగ్గించి.. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని రైతులకు లోకేశ్ హామీ ఇచ్చారు. యువగళం కార్యక్రమంలో భాగంగా.. అనంతపురం జిల్లా శింగనమల మండలంలో రైతన్నతో లోకేశ్ కార్యక్రమంలో.. అన్నదాతలు లేవనెత్తిన ప్రశ్నలు, సమస్యలకు ఆయన సమాధానమిచ్చారు..
యువగళం పాదయాత్రలో భాగంగా.. అనంతపురం జిల్లా శింగనమల మండలంలో శనివారం చేపట్టిన.. 'రైతన్నతో లోకేశ్' కార్యక్రమంలో అన్నదాతలు.. తమ కష్టనష్టాలను లోకేశ్‌తో పంచుకున్నారు. వైసీపీకి ఓటు వేసి మోసపోయామని.. ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అమలు చేసిన రాయితీలు, పథకాలన్నీ ఎత్తివేశారంటూ వాపోయారు. పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తే.. తెలుగుదేశానికి మద్దతిస్తామంటూ లోకేశ్‌కు స్పష్టం చేశారు.
"మాకు కరెంట్ ప్రాబ్లమ్ చాలా ఎక్కువగా ఉంది. ఇంతకు ముందు 7 గంటలు విద్యుత్ ఇచ్చేవారు. ఇప్పుడు ఆరు గంటలు మాత్రమే ఇస్తున్నారు. అది కూడా ఓల్టేజ్ లేదు. దీనివల్ల మా ప్రాంతంలో పంట మొత్తం ఎండిపోయింది. ప్రభుత్వం నుంచి ఇన్సురెన్స్ గానీ, సబ్సీడీ గానీ, వాతావరణ భీమ్ గానీ ఏమీ మాకు అందట్లేదు. పది ఎకరాల పొలం ఉందని నాకు పింఛను, రేషన్ కార్డ్ కూడా కట్ చేశారు." - మంజునాథ్, రైతు
జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన రైతులు.. ఉద్యాన పంటల మొక్కలకు రాయితీలు ఇవ్వాలని, ఈ ప్రభుత్వం అన్నీ ఎత్తేయటం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. ఎరువులు, పురుగుమందుల ధరలు పెరిగినంతగా పంట ఉత్పత్తులకు ధరలు రావటంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని, రైతులకు పెద్దపీట వేసి, పంటలకు గిట్టుబాటు ధర ఇప్పించటమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటామని లోకేశ్ అన్నదాతలకు హామీ ఇచ్చారు. దాదాపు గంటన్నర పాటు రైతులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన లోకేశ్.. రైతుల సంక్షేమం కోరే తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు.
ఆదివారం 65వ రోజు పాదయాత్ర కొనసాగించనున్న లోకేశ్.. జంబులదిన్నె విడిది కేంద్రం వద్ద.. ఉదయం 8 గంటలకు వర్కింగ్ ప్రొఫెషనల్స్‌తో ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం నాగులగూడెం తండా రోడ్డులో.. ఎస్టీలతో, ఆపై స్థానికులతో భేటీ కానున్నారు. మధ్యాహ్నం చిన్నజలాలపురంలో.. రాయదుర్గం నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు. సాయంత్రం 4 గంటలకు శింగనమల చెరువు వద్ద మత్స్యకారులతో సమావేశం కానున్నారు. శింగనమల గుడి వద్ద విశ్వబ్రాహ్మణులతో భేటీ కానున్నారు.
ఇవీ చదవండి: